
సుమారు 40 సంవత్సరాలుగా కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన ఎలుగుబంట్ల సత్తిబాబు ఈ బాణాసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీపావళి సమీపిస్తున్న క్రమంలో కేంద్రంలో పెద్ద మొత్తంలో బాణాసంచా సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ భయంకర ప్రమాదం చోటుచేసుకోవడం మరింత విషాదాన్ని మిగిల్చింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శరవేగంగా రంగంలోకి దిగారు. మంటలను నియంత్రించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యల వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతేకాక, అవసరమైతే స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హోంమంత్రి అనిత కూడా ఈ ఘటనపై స్పందించారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు హోమంత్రికి వివరించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆమె ఆదేశించారు. అధికారుల సమాచారం ప్రకారం, ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి 2026 వరకు లైసెన్స్ ఉన్నట్లు తేలింది.
అయినప్పటికీ, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. మానవ తప్పిదమా? లేక సాంకేతిక లోపమా? అన్న కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మొత్తం కోనసీమ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. బాణాసంచా సెంటర్ కూలిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. మంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కేకలు చుట్టుపక్కల గ్రామాలను కదిలిస్తున్నాయి. దీపావళి సందడి ముందే విషాదం ముసురుకోవడంతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఘటన మళ్లీ ఒకసారి బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై పెద్ద చర్చకు దారి తీసింది.