ఒమిక్రాన్‌.. ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వేరియంట్ ఇది. చాలా దేశాల్లో ఈ వేరియంట్ కారణంగా మూడో వేవ్‌ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి  బ్రిటన్, యూరోపియన్ యూనియన్ లో ఈ వేరియంట్‌ విజృంభిస్తోంది. అంతే కాదు.. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ అప్పుడే వందకుపైగా దేశాల్లో విస్తరించేసింది కూడా. అందుకే చాలా దేశాలు ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందుగానే సిద్ధమవుతున్నాయి.  


కరోనా కట్టడిలో ముందు నుంచి ముందు చూపుతో ఉన్న ఇజ్రాయెల్ దేశం మరోసారి ముందడుగు వేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తన పౌరులకు టీకాలు ఇవ్వడంలో ఇజ్రాయెల్ చాలా ముందుంది.. ఇప్పటికే దాదాపు దేశంలోని నూటికి నూరు శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశంగా రికార్డులు కూడా సృష్టించింది. అంతే కాదు.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాల కంటే చాలా ముందుగానే బూస్టర్‌ డోసుకు అనుమతి ఇచ్చింది కూడా ఇజ్రాయెల్ దేశమే.


ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా నాలుగో డోస్‌ కూడా వేసుకోవాలని తన పౌరులకు సూచిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సీన్‌ నాలుగో డోస్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి అనేక ప్రపంచ సంస్థలు హెచ్చరించాయి. అనేక అధ్యయనాల్లో ఇది డెల్టా కంటే చాలా డేంజర్‌గా వ్యాప్తి చెందుతుందని తేలింది. అందుకే ముందస్తు జాగ్రత్తగా నాలుగో డోస్ కూడా తన పౌరులకు ఇవ్వాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది.


ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కరోనా బూస్టర్‌ డోస్ ఇస్తున్నాయి. మన ఇండియా కూడా బూస్టర్ డోసు గురించి ఆలోచించినా.. ఇప్పుడే అవసరం లేదన్న ఆలోచనలో ఉంది. పిల్లకు టీకాల విషయంలోనూ ఇండియా ఇంకా సుముఖంగా లేదు. ఇజ్రాయెల్ మాత్రం కరోనా గురించి ఎలాంటి రిస్క్ కూడా తీసుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే ఏకంగా నాలుగో డోస్‌ కు కూడా రెడీ అయిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: