భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయేది జగమెరిగిన సత్యం. అప్పట్లో మహారాజులు తమ విజయగాధలకు గుర్తుగా  ఆలయాలు నిర్మించి... వాటిలో ప్రత్యేక స్థూపాలను ఏర్పాటు చేసేవారు. అలాంటి వాటిల్లో ఒకటి సంగమేశ్వర ఆలయం. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలోని కృష్ణా నదీ పరివాహాక ప్రాంతంలో  శ్రీ సంగమేశ్వర స్వామి కొలువైన  దివ్యక్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో 8 నెలలు నీటిలో ఉంటుంది. కేవలం 4 నెలలు మాత్రమే చెక్క లింగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు.

పాండువుల్లో అగ్రజుడు ధర్మరాజుతో ఇక్కడ వేపచెట్టును శివలింగం రూపంలో ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గర్లో ఉండే ఈ క్షేత్రం 1981 వరకు నిత్యపూజలు అందుకుంది. సప్త నదుల సంగమ ప్రదేశం  కావడంతో ఈ స్వామికి సంగమేశ్వరుడు అనే పేరు వచ్చింది. భవనాసి, వేణి, తుంగ, భద్ర, భీమారథి, మలపహారిణి నదులు కృష్ణలో కలిసే ప్రదేశం ఇదే. అందుకే ఈ స్వామికి ఎంతో విశిష్ఠత.

 
శ్రీశైల ప్రాజెక్టు నిర్మాణం అనంతరం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ సంగమేశ్వర ఆలయాన్ని ముంచేస్తుంది. అందుకే ఏడాదిలో 8 నెలలు కృష్ణమ్మలో ఉండే చెక్క లింగేశ్వరస్వామి... 4 నెలలు మాత్రం భక్తుల చేత పూజలు అందుకుంటారు.

 
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి లక్షా పది వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఔట్ ఫ్లో 28 వేల 252 క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 842 అడుగులకు నీరు చేరింది. క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో... సంగమేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణమ్మ చుట్టేసింది. గర్భాలయంలోని చెక్క లింగేశ్వరస్వామి పూర్తిగా నీట మునిగడంతో ఆలయ అర్చకులు నదీ హారతితో ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ నాలుగు నెలల తర్వాత ప్రాజెక్టులో నీటి మట్టం 835 అడుగులకు పడిపోయిన తర్వాత ఆలయంలోనికి భక్తులను అనుమతిస్తారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: