జగన్మోహన్ రెడ్డికి  బీజేపీ ఎంపి సుబ్రమణ్యం స్వామి ఫుల్లు సపోర్టుగా నిలుస్తున్నారు. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటాన్ని స్వామి తప్పుపట్టారు. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం తప్పు చేస్తోందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తన అభిప్రాయాన్ని ప్రధానమంత్రికే చెప్పనన్నారు. బుధవారం స్వామి అమరావతికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. మొదటి నుండి జగన్ విధానాలకు స్వామి మద్దతుగా నిలబడుతున్నారు. గతంలో టీటీడీ ఖాతాలను కాగ్ తో ఆడిట్  చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పట్లోనే స్వామి స్వాగతించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ఉక్కు అంశంపై మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధానమంత్రికి జగన్ రెండుసార్లు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు.



ప్రధానికి రాసిన లేఖలో జగన్ మంచి ప్రపోజలే చేశారని అయితే మోడి ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాపైన స్వామి ఫుల్లుగా ఫైర్ అయ్యారు. జగన్ పై బురద చల్లేందుకు చంద్రబాబు ఆంధ్రజ్యోతిని అడ్డుపెట్టుకుంటున్నట్లు స్వామి మండిపడ్డారు. జగన్ను బద్నాం చేయటంలో భాగంగానే ఎల్లోమీడియా చంద్రబాబుకు మద్దతుగా బురద చల్లేస్తోందని అనుమానించారు. ఇందులో భాగంగానే టీటీడీపై తప్పుడు వార్తలు రాయటానికి కూడా ఎల్లోమీడియా వెనకాడటం లేదన్నారు. తప్పుడు వార్తలు రాస్తున్న కారణంగానే ఆంధ్రజ్యోతిపై తాను రూ .100 కోట్లకు పరువునష్టం దావా వేసినట్లు చెప్పారు.



చివరగా పెట్రో ధరల పెరుగుదలలో కేంద్రాన్ని స్వామి తప్పుపట్టారు. పెట్రోధరల పెరుగుదల మధ్య తరగతి జనాలకు చాలా భారంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల్లో ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించేయటాన్ని స్వామి తప్పుపట్టారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్ధను ప్రైవేటువ్యక్తులకు అమ్మేయటం దేశానికి మంచిది కాదన్నారు. అమ్మకం విషయంలో ప్రతి సంస్ధను కేస్ బై కేసుగా స్టడీ చేయాలని అభిప్రాయడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు స్వామి అమరావతికి వచ్చి జగన్ను ఎందుకు కలిసారనే విషయం సస్సెన్సుగా మారింది. పైగా జగన్ తో భేటి తర్వాత మోడి, చంద్రబాబు, ఎల్లోమీడియా వ్యవహారాలను తప్పుపట్టడమే కాకుండా జగన్ విధానాలను మెచ్చుకోవటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: