రాజకీయాల్లో నాయకులకు అదృష్టం అరుదుగా వస్తుంటుంది..అలాంటప్పుడు ఆ అరుదైన అదృష్టాన్ని సరిగ్గా ఉపయోగించుకునే ఆ నాయకులకు తిరుగుండదు. కానీ ఆ అదృష్టాన్ని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు సరిగ్గా ఉపయోగించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఆ అదృష్టం పూర్తిగా అడ్డం తిరిగేలా ఉంది.

అసలు 2019 ఎన్నికల్లో జగన్ అనే అదృష్టంతో టీడీపీ కంచుకోట అయిన పలాసలో అప్పలరాజు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా అదృష్టం ఎక్కువ ఉంది కాబట్టే, మండలి రద్దు అంశం రావడం, ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం, అదే వర్గానికి చెందిన అప్పలరాజుని మంత్రి పదవి వరించడం జరిగాయి. ఇక మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేసి ఏడాది దాటింది. మరి ఈ ఏడాదిలో అప్పలరాజు మంత్రిగా ఏం సాధించారు? అంటే ఏమో అది ఆయనకే తెలియాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏం సాధించారో జనాలకు సరిగా క్లారిటీ లేదు.

తన శాఖపై ఎంత పట్టు తెచ్చుకున్నారు...అలాగే తన వర్గం ప్రజలకు ఎంత ఉపయోగపడేలా పనులు చేశారనేది కూడా తెలియదనే చెప్పొచ్చు. అసలు మత్స్య, పశుసంవర్ధక శాఖపై అప్పలరాజు కంటే ఒక అధికారికే పట్టు ఎక్కువ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన చెప్పినట్లే కార్యక్రమాలు నడుస్తాయట. ఇక అప్పలరాజు ఫైళ్ళ మీద సంతకాలు చేయడానికి బాగా పనికొస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని బట్టి మంత్రిగా అప్పలరాజు పనితీరు ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

మరి ఎమ్మెల్యేగా పలాసలో ఏం చేస్తున్నారనేది చూసుకుంటే..ఎమ్మెల్యేగా పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారని తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలులో ముందున్నారు...పలాసలో కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, సి‌సి రోడ్లు, హెల్త్ క్లినిక్‌లు, రైతు బజార్లు, జగనన్న కాలనీలు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరిగాయి. అయితే పలాసలో ఇంకా పలు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఉన్న జీడి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉండాల్సిన అవసరముంది. అభివృద్ధి తక్కువ. తాగునీరు ఇబ్బందులు ఎక్కువ. స్వచ్చమైన నీరు అందక కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి.

రాజకీయంగా చూస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు అప్పలరాజు బలం తగ్గినట్లే కనిపిస్తోంది. పలాస టీడీపీ కంచుకోట కావడంతో ఇక్కడ గౌతు శిరీష త్వరగానే పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే అప్పలరాజు అందివచ్చిన అదృష్టాన్ని కంటిన్యూ చేసుకునేలా లేరు.  


మరింత సమాచారం తెలుసుకోండి: