ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చెప్పారంట‌. పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలంటే.. వీరికి ఏం తెలుసు.. క‌నీసం కె.రాఘ‌వేంద్ర‌రావు సినిమాల‌న్నా చూశారా? అంటే అదీ కొంచెం అనుమానంగానే ఉందాయే.. రాజ‌కీయాల్లో నిత్యం బిజీగాఉండే నేత‌లాయే వీరంతా. మ‌రి సినిమాలకు ఏం స‌మ‌యం కేటాయిస్తారు?  ప‌వ‌న్‌క‌ల్యాణ్ ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు వ్యూహ‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకున్న‌ట్లుగా ఇప్పుడు బీజేపీ కూడా ఎవ‌రైనా కార్య‌క్ర‌మ ప‌ర్య‌వేక్ష‌కుల‌ను నియ‌మించుకోవాల్సి వ‌స్తుందేమో! అయినా అది సోము వీర్రాజుగారి ఆలోచ‌నాతీరుపై ఆధార‌ప‌డివుంటుంది. ఢిల్లీ నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చే శ‌బ్ద త‌రంగాల‌పై ఆధార‌ప‌డివుంటుందేమో.

మీ పార్టీవార‌న్నా ఇష్టంలేదా?
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప‌వ‌న్ చాలా ఇష్ట‌మైన వ్య‌క్తి అని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో మోడీకి, అమిత్ షాకి ఇష్ట‌మైన‌వారెవ‌రూ లేర‌నేగా మీ ఉద్దేశం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక్క‌డే వీరికిష్టం. మీ పార్టీవారెవ‌రు కూడా వారిద్ద‌రికీ ఇష్టంలేదా?  మీ మాట‌ల‌ను బ‌ట్టి ఇలానే అర్థ‌మ‌వుతోందే. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, విజ‌యసాయిరెడ్డి అన్నా కూడా ఇష్టంలేదా? ఒక్క‌సారి మీరు క‌నుక్కొని చెప్పండి. ప‌వ‌న్ ఒక్క‌డే ఇష్ట‌మంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులంతా ఎగిరి గంతేస్తారు.

ట్రూ స్పిరిట్ అంటే..
అన్నివిధాలా గౌర‌విస్తామ‌ని చెబుతున్నారు. అంటే ఇప్ప‌టివ‌ర‌కు మీరు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గౌర‌వం ఇవ్వ‌లేద‌నే గా అర్థం. అంటే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఉప‌యోగించుకొని త‌ర్వాత ఎవ‌రి దారి వారు చూసుకుందాంలే అని అనుకున్నారా?  తిరుప‌తిలో మీరు చెప్పిన‌దాన్ని బ‌ట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లంతా ఇలాగే అనుకుంటున్నారే వీర‌య్యా..!  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఘంటాపథంగా నొక్కి చెప్పారు సోము వీర్రాజు. ట్రూ స్పిరిట్‌తో ఈ అంశాన్ని తీసుకోవాలంటున్నారు.. మాకు తెలిసిన స్పిరిట్ ఒక‌టేలే. అది కూడా అంద‌రికీ అందుబాటులో ఉండ‌దు. అదంతా ఫాల్స్. నాట్ ట్రూ.

ఎన్నిక‌ల ముందేంటి? త‌ర్వాతేంటి?
రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని చెప్పారు. ఈ విష‌యంలోనే ప్ర‌జ‌లంతా సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీకి ముఖ్య‌మంత్రా?  తిరుప‌తికి ముఖ్య‌మంత్రా? అని. అంటే ఏముంద‌బ్బా.. తిరుప‌తి ముఖ్య‌మంత్రి అంటే తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌ను ఉప‌యోగించుకోవ‌డం.. ఆ త‌ర్వాత ఎవ‌రిదారి వారు చూసుకోవ‌డం.. అలా కాకుండా ఏపీ ముఖ్య‌మంత్రి అంటే మీ పార్టీకి ఎలాగూ బ‌లంలేదు కాబ‌ట్టి రాబోయే ఎన్నిక‌ల్లో మీరిద్ద‌రూ క‌లిసి పోటీచేస్తారు కాబ‌ట్టి ఎన్నిక‌ల్లో గెలిచి ప‌వన్‌క‌ల్యాణ్ ముఖ్య‌మంత్రి అవుతార‌నేది అంద‌రి భావ‌న‌. వైసీపీ, టీడీపీ రెండు, మూడు స్థానాల‌కు ప‌రిమిత‌మ‌వుతాయి. బీజేపీ-జ‌న‌సేన మొద‌టిస్థానంలో ఉండి అధికారం చేజిక్కించుకుంటుంది. అంతేగా!!!!.

మరింత సమాచారం తెలుసుకోండి: