ఒక గ్రామానికి సర్పంచ్‌ అంటే.. ఆ దర్జానే వేరు. ఇక ఆ హోదాలోని వ్యక్తి అధికార పార్టీకి మద్దతుదారుడు అయితే ఆయనకు అన్నీ కలిసి వస్తాయని అనుకోవడం సహజం. కానీ ఇందుకు భిన్నంగా తయారైంది ఆ గ్రామ సర్పంచ్‌ పరిస్థితి. గ్రామాభివృద్ధికి అధికార పార్టీ నుంచి సహకారం లభించకపోవడంతో.. ఆ సర్పంచ్‌ తన సొంత డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టుకున్నాడు. చివరకు అప్పుల పాలై కుటుంబ పోషణ కోసం సెక్యూరిటీ గార్డుగా అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఆరేపల్లి సర్పంచ్‌ ఇసురు మల్లేష్. మొన్నటి ఎన్నికల్లో ఆరేపల్లి గ్రామం ఎస్సవీకి రిజర్వ్ అయింది. సర్పంచ్‌ని ఏగ్రీవంగా ఎన్నికుంటే రూ. 15 లక్షల రూపాయలను గ్రామాభివృద్ధికి నజరానాగా ఇస్తామని కేసీఆర్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామస్థులు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. డ్రా పద్ధతిలో గ్రామ సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. దీంతో సర్పంచ్‌ స్థానంలో కూర్చోనే అదృష్టం ఇసురు మల్లేష్‌ను వరించింది. అయితే ఇదే ఆయన్ను కష్టాలపాలు చేసిందన్న అభిప్రాయాలు గ్రామస్థుల్లో వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఆరేపల్లి సర్పంచ్‌ ఇసురు మల్లేష్.. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు అనుచరుడు కూడా. మల్లేష్‌ సర్పంచ్‌ పదవి చేపట్టి నుంచి ఇంతవరకు నయా పైసా అభివృద్ధి జరగలేదు. ఏకగ్రీవం అయితే ఇస్తామన్న 15 లక్షలు రాలేదు. అభివృద్ధి పనులూ మంజూరు కాలేదు. చేయాల్సిన చిన్నపాటి పనులకూ డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో  మల్లేష్‌ తన సొంత నిధులతో కొన్ని పనులు చేశారు. పారిశుద్ధ్య పనులు, దోమల మందు పిచికారీ, మొక్కలు నాటడం, రోడ్లకు మరమ్మతులు స్వయంగా చేపట్టారు. ఏదో ఓ రోజు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో కొన్ని కాంట్రాక్టు పనులు కూడా చేశారు. నెలలు గడుస్తున్నా నయా పైసా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలకు 5 వేల రూపాయల గౌరవ భృతి కూడా రెగ్యులర్‌గా రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావడం, కుటుంబ పోషణ భారం కావడంతో.. నిజామాబాద్‌లోని ఓ అపార్ట్ మెంటులో సెక్యురిటీ గార్డుగా మల్లేష్‌ చేరాడు. పగలంతా ఊరి సర్పంచ్‌గా ఉండే మల్లేష్‌... రాత్రి కాగానే అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఆరేపల్లి గ్రామంపై అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తే.. గ్రామస్థులంతా ఒక్కటే కారణం చెబుతున్నారు. అదేమిటంటే- గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ గ్రామస్థులు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు మద్దతు పలికారు. ఇక్కడి 200 పైచిలుకు ఓట్లలో 90 శాతం బీజేపీకి పడ్డాయి. అందుకే ఇటు ముఖ్య నేతలు, అటు అధికారులు ఈ గ్రామంపై చిన్నచూపు చూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అసలు ఈ గ్రామాన్నే పట్టించుకోవడం లేదు. అందుకే గ్రామంతో పాటు ఆ గ్రామాన్ని పాలిస్తున్న సర్పంచ్‌నూ వేధిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: