గుంటూరు జిల్లాలో కీలకమైన పల్నాడులోని మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశంపార్టీ తరపున గట్టి నేతకు పగ్గాలు అప్పగించినట్లే ఉంది. జూలకంటి బ్రహ్మారెడ్డిని నియోజకవర్గంలో రిసీవ్ చేసుకున్న విధానంతోనే  ఈ విషయం అర్ధమవుతోంది. 1999 తర్వాత టీడీపీ తరపున మాచర్లలో గెలిచిన వాళ్ళలేరు. 2004 నుండి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదే పూర్తి ఆధిపత్యం కనబడుతోంది. వరసుగా ఐదుసార్లు మాచర్ల నుండి ఎంఎల్ఏగా గెలవటమంటే మామూలు విషయంకాదు.




అసలు ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా వరసగా రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచిందే లేదు. అలాంటిది పిన్నెల్లి ఐదుసార్లుగా గెలుస్తున్నారంటేనే ఎంఎల్ఏకి ఎంత పట్టుందో అర్ధమైపోతోంది. పిన్నెల్లిని బలంగా ఢీ కొట్టేంత సీన్ టీడీపీలో ఎవరికీ లేదనేది వాస్తవం. ఎందుకంటే ఎన్నికకు ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపుతుండటం వల్లే పార్టీ బాగా వీకైపోయింది. పార్టీ వీకైపోయింది కాబట్టే ఏ నేతకు నియోజకవర్గంలో పట్టులేకపోయింది. అలాంటిది చాలా కాలం తర్వాత గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన జూలకంటిని నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు.




జూలకంటి తల్లి, దండ్రులు కూడా గతంలో ఎంఎల్ఏలుగా పనిచేసిన వారే. అంటే జూలకంటిది మంచి రాజకీయ నేపధ్యమున్న కుటుంబమే.  ఇదే సమయంలో నియోజకవర్గం ఇన్చార్జి పదవి కోసం కుర్ని పున్నారెడ్డి, మధుబాబు కూడా జూలకంటికే మద్దతు ప్రకటించారు. దాంతో బుధవారం నియోజకవర్గానికి వచ్చిన జూలకంటికి బ్రహ్మాండమైన స్వాగతం లభించటం విశేషం. ఇన్చార్జిగా అపాయింట్ అయిన జూలకంటిని పార్టీ నేతలు, కార్యకర్తలంతా కలిసి పెద్ద ఊరేగింపుగా మాచర్ల పట్టణంలోకి తీసుకువచ్చారు. దాంతో పార్టీలో కొత్త హుషారు వచ్చినట్లయ్యింది.




ఈమధ్య కాలంలో మాచర్లలో పార్టీ మొత్తం స్తబ్దుగా ఉంది. అలాంటిది జూలకంటి నియామకం వల్ల ఒక్కసారిగా జోష్ మొదలైంది. ఇంకాలం తనకు ఎదురే లేదన్నట్లుగా ఉన్న పిన్నెల్లికి జూలకంటి గట్టి పోటీదారే అన్నట్లు వ్యవహారం తయారైంది. జనాల్లో కూడా మాచర్ల టీడీపీకి సరైనోడు దొరికాడనే టాక్ మొదలైంది. జూలకంటి నియామకం వల్ల వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లి ఓడిపోతాడని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే పిన్నెల్లి గెలుపు కూడా అంత వీజీ కాదు. తమ్ముళ్ళంతా ఏకతాటిపై నిలబడి, పార్టీ అధిష్టానం నుండి జూలకంటికి పూర్తి మద్దతు దొరికితే పిన్నెల్లి గెలుపుకు చాలా కష్టపడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: