ఆప్ అధినేత, డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ హత్యకు బీజేపీ కుట్రపన్నుతోందా.. ఆయన్ను చంపించాలని బీజేపీ ప్రయత్నిస్తోందా.. పంజాబ్‌లో కేజ్రీవాల్ పార్టీని ఓడించలేకపోయిన బీజేపీ ఇప్పుడు కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటోందా.. అవునంటున్నారు ఆప్ నేత మనీశ్ సిసోడియా.. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటి వద్ద బీజేవైఎం కార్యకర్తలు దాడులకు దిగడం ఆ హత్యాయత్నంలో భాగమేనంటున్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా.


పంజాబ్‌లో ఆప్ చేతిలో దారుణంగా ఓటమిపాలైన బీజేపీ అరవింద్‌ కేజ్రీవాల్‌ని చంపాలనుకుంటోందని మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఉత్తినే ఆరోపించడమే కాదు.. దీనిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆప్ ప్రకటించింది. అసలు బీజేవైఎం కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్ ఇంటివద్ద ఎందుకు ఆందోళన చేశారంటే.. దానికీ ఓ నేపథ్యం ఉంది. ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


ఈ సినిమాపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల పట్ల హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. బీజేవైఎం అంటేనే యువ మోర్చా కద.. అందుకే దిల్లీ సీఎం ఇంటి వద్ద భాజపా యువజన విభాగం బీజేవైఎం కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. దీనిపై మండిపడిన మనీశ్‌
సిసోడియా.. పంజాబ్‌ లో కేజ్రీవాల్‌ను ఓడించలేకపోయిన బీజేపీ ఇప్పుడు ఆయన్ను చంపాలనుకుంటోందన్నారు. ఈరోజు సీఎం ఇంటి వద్ద జరిగిన దాడి.. పోలీసుల సహకారంతోనే జరిగిందని ఆయన ఆరోపించారు.


బీజేపీ కేజ్రీవాల్‌ను చంపాలని భావిస్తున్నట్టు తమ పరిశీలనలో తేలిందని.. దీనిపై మేం అధికారికంగా కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదే సమయంలో ఆప్‌ అధినేత పై బీజేపీ శ్రేణుల దాడిని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా  ఖండించారు. పంజాబ్‌లో ఆప్‌ చేతిలో ఘోర పరాజయం పాలైనందుకు భాజపా ఆగ్రహావేశాలు ఈ ఘటనకు దారి తీశాయని గుర్తు చేశారు. సీఎం ఇంటి వద్ద పోలీసుల సమక్షంలో జరిగిన దాడి ఘటన ఒట్టి పిరికిపంద చర్యగా అంటున్నారు మాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

AAP