అభిమాన నాయకులకు అభివాదం చేయడంలో తప్పులేదు. అదే సమయంలో తమ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుందని చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ ఆ రెండు చేసే సమయంలో ఆయన మోకాళ్లపై వంగి మరీ వినయం ప్రదర్శించడం కొంతమందికి నచ్చలేదు. అందులోనూ తమ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుందని చెప్పడం కూడా వారికి ఆగ్రహం తెప్పించింది. అందుకే వారంతా రోడ్డెక్కారు. నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా అనుకోకుండా తాను చేసిన పనికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది మంత్రి వేణుగోపాలకృష్ణ.

శెట్టి బలిజలకు జగన్ న్యాయం చేశారని, ఆ సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇచ్చారని, తమ సామాజిక వర్గానికి ఎప్పుడూ అండగా ఉంటున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ ఓ వేదికపై చెప్పారు. అదే వేదికపై ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై మోకరిల్లారు. శెట్టిబలిజ జాతి మొత్తం జగన్ కి రుణపడి ఉంటుందని అన్నారు. అయితే అప్పటికప్పుడు అది కేవలం సంచలనంగా మారినా.. ఆ తర్వాత మాత్రం శెట్టిబలిజ వర్గం ఆ ఘటనపై తీవ్రంగా మండిపడింది. అందులోనూ ఓ వర్గం నిరసన ప్రదర్శనలకు కూడా దిగడం విశేషం.

కోనసీమ జిల్లాలోని శెట్టిబలిజ సంఘం నాయకులు, మంత్రి వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా మోకాళ్లపై వంగి నమస్కారం చేయడం ఏంటని.. అందులోనూ తమ జాతి మొత్తం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. శెట్టిబలిజ జాతికి మంత్రి వేణుగోపాల కృష్ణ  వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. తమ సామాజిక వర్గాన్ని మంత్రి కించపరిచే విధంగా వ్యవహరించారని అన్నారు. తమ పరువు తీశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చినికి చినికి గాలివానలా..
ఈ వ్యవహారం ఇప్పుడు శెట్టిబలిజ సామాజిక వర్గంలో చినికి చినికి గాలివానలా మారింది. మంత్రి క్షమాపణ చెప్పాలంటూ కొంతమంది నిరసన ప్రదర్శనకు దిగడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. మరి మంత్రి ఈ నిరసనలకు బదులిస్తారా..? తాను చేసిన పనిని సమర్థించుకుంటారా..? లేదా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: