రాజకీయాల్లో ఒకరిపై మరొకరు వ్యతిరేకత పెంచుకోవటానికి, లేదా దగ్గరవ్వటానికి పెద్దగా కారణాలు ఉండాల్సిన అవసరంలేదు. ఒక్క కారణంతోనే ఒకపార్టీపై మరొక సామాజికవర్గం లేదా ఒక సామాజికవర్గానికి మరో సామాజికవర్గం దూరమైపోయిన ఘటనలున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై ఏపీలోని కాపులు మండిపోతున్నారు. దానికి కారణం ప్రత్యేకించి ఏమీలేదు. హైదరాబాద్ పర్యటనలో అమిత్ ఒక హోటల్లో జూనియర్ తో డిన్నర్ భేటీ అవ్వటమే కారణం.





అమిత్, జూనియర్ తో డిన్నర్ చేశారు. వీళ్ళిద్దరు కలవటంలో కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. భేటీలో వీళ్ళు ఏమి మాట్లాడుకున్నారనే విషయం ఇప్పటికిప్పుడు బయటపడే అవకాశంలేదు. అందుకనే జూనియర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాను అమిత్ చూశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అందులో జూనియర్ అద్భుతమైన నటనను అమిత్ మెచ్చుకుని అభినందించటానికే జూనియర్ ను భోజనానికి పిలిచినట్లు చెప్పారు.





సరే ఎవరైనా ఇంతకుమించి సమర్ధించుకునేందుకు ఏమీలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకున్నది కిషన్ రెడ్డికి కూడా తెలీదు. వీళ్ళభేటీ సంగతిని పక్కనపెట్టేస్తే త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ మాత్రమే కాదుకదా రాం చరణ్ కూడా నటించాడు కదా అనే పాయింట్ ను కాపులు రైజ్ చేశారు. ఇద్దరు హీరోలు నటించిన సినిమాలో జూనియర్ అద్భుతంగా నటించాడంటే మరి రాం చరణ్ సంగతేమిటి అనే విషయాన్ని ఇపుడు వివాదం చేస్తున్నారు.





ఇది ఎక్కడినుండి ఎక్కడికి వెళ్ళిందంటే బీజేపీకి కమ్మలే తప్ప కాపులు అవసరంలేదా అనేస్ధాయికి చేరుకుంటోంది వివాదం. తమ వాదనకు మద్దతుగా మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నరేంద్రమోడీ, అమిత్ షాలు అవమానిస్తున్న విషయాలను గుర్తు చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళద్దరు పవన్ కు చేసిన అవమానం ఏమిటంటే అపాయిట్మెంట్ ఇవ్వటంలేదట. ఇక్కడ విషయం ఎలాగ తయారైందంటే ‘రాజుగారి పెద్ద భార్య మంచిదంటే మరి చిన్న భార్య చెడ్డదా’ ? అనే వితండ వాదం చేసినట్లే ఉంది. మరి తాజా వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: