ఇసుక సమస్యపై ఏపీ సీఎం జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు. కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని అస్త్రంగా మలచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు రోజూ ఈ అంశంపై మాట్లాడుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కు రెడీ అవుతున్నారు. ఇంకోపక్క నారా లోకేశ్ దీక్షకు కూర్చుంటున్నారు. దీంతో వైఎస్ జగన్ ఈ ఇష్యూని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.


ఇసుక సమస్యపై సమీక్ష నిర్వహించిన జగన్.. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇసుక వారోత్సవం అని కార్యక్రమం కూడా పెట్టారు. అధికారులంతా వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దామన్నారు. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా వెళ్లకూడదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలి. డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలి..అంటూ అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు.


భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదన్న అంశంపైనా జగన్ స్పందించారు.భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు పని దొరకడం లేదన్నది సరికాదు. గతంలో అవినీతి మాఫియాతో ఇసుకను తరలించేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది. ఇప్పుడు మరింతగా కార్మికులకు పనులు లభిస్తాయి. పట్టా భూములున్న రీచ్‌ల్లో తప్ప మిగతా చోట్ల ఇసుక తీయాలని చెప్పాం. గ్రామ సచివాలయాల్లో ఎవరైనా చలానా కట్టి 20 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తరలించవచ్చన్నారు.


పనులు కావాల్సిన వారు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక రీచ్‌ల్లో పనులు చేసుకోవచ్చు. వరదలు తగ్గగానే రీచ్‌ల్లో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలి. ప్రభుత్వ ఆధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది కాబట్టి పేదలకు మరింత మంచే జరుగుతుంది. ప్రతిపక్షం కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంది. వరదల కారణంగా 267 రీచ్‌లకు 69 చోట్ల ఇసుక తీస్తున్నారు. నవంబర్‌కు వరదలు తగ్గుతాయి.. ఇసుక అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: