ప్లీనరీ సందర్భంగా మాజీమంత్రి కొడాలి నాని చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ కొడాలి చేసిన ప్రకటన ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో వల్లభనేని వంశీయే పోటీచేస్తారని. కొడాలి చేసిన ప్రకటన గన్నవరం రాజకీయాల్లో బాంబులాగ పేలింది. ఎందుకంటే వంశీని పార్టీలోని రెండు బలమైన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేసేది తామే అంటు రెండువర్గాల నేతలు ఎవరికివారుగా ప్రకటించేసుకుంటున్నారు.





సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే జరిగిన ప్లీనరీ సమావేశాల్లో కొడాలి మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో పోటీచేసేది వంశీయే అని ప్రకటన చేశారు. దాంతో రెండు వర్గాలు ఒక్కసారిగా భగ్గమంటున్నాయి. కొడాలి మాట్లాడుతు టికెట్ విషయాన్ని తన మాటగా చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్ వంశీకే అని జగన్మోహన్ రెడ్డి తనతో అన్నట్లుగా కొడాలి చెప్పారు. దాంతో వంశీకే టికెట్ అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది.






2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ తరపున గెలిచారు. అప్పుడు వంశీపై పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు, మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు ఇపుడు ఏకమయ్యారు. ఇద్దరు కలిసే వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందరు కలిసి పనిచేసుకోవాలని స్వయంగా జగన్ చెప్పినా వీళ్ళిద్దరు పట్టించుకోవటంలేదు. దీంతో ఇక లాభంలేదని అనుకున్నారో ఏమో తన మాటనే కొడాలి ద్వారా జగన్ చెప్పించినట్లయ్యింది. ఇప్పటికే యార్లగడ్డ కోసం టీడీపీ గాలమేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.






అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున వంశీ, టీడీపీ తరపున యార్లగడ్డ పోటీచేసేందుకే అవకాశాలు ఎక్కువున్నాయి. మరి వంశీకి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారో తెలీదు. అలాగే యార్లగడ్డకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏమేరకు పనిచేస్తారో అనుమానమే. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో జనాల దృష్టితో పాటు రాజకీయ హీట్ ను పెంచేసే నియోజకవర్గాల్లో గన్నవరం కూడా చేరిపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో వంశీ పట్టేమిటో వచ్చే ఎన్నికల్లో తేలిపోవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: