
అయితే, జనసేన గెలుపు కంటే కూడా టీడీపీలోనే వర్గపోరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాజానగరం టీడీపీ ఇన్‌చార్జిగా బొడ్డు వెంకటరమణ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు పిలుపులను అందిపుచ్చుకుని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇదే విషయం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గానికి మింగుడు పడడం లేదు.
వచ్చే ఎన్నికల సంకేతాలతో రగిలిపోతున్న పెందుర్తి :
వచ్చే ఎన్నికల నాటికి బొడ్డు వెంకటరమణ నియోజకవర్గంలో మరింత పుంజుకుని, టికెట్ రేసులో ముందు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు పార్టీలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన పెందుర్తి వెంకటేష్, ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, బొడ్డు వెంకటరమణ కార్యక్రమాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించకూడదంటూ పెందుర్తి కుటుంబం నుంచి అంతర్గతంగా 'వార్నింగ్‌లు' వెళ్తున్నాయని సమాచారం.
అధిష్టానం దృష్టికి చేరిన వర్గపోరు!:
కొంతకాలంగా ఈ అంతర్గత వివాదం కొనసాగుతుండగా, తాజాగా ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానం దృష్టికి చేరింది. బొడ్డు వెంకటరమణకు సహకరించవద్దని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పెందుర్తి వెంకటేష్ కుమారుడు అభిరామ్ హెచ్చరిస్తున్నారని స్థానిక పార్టీ నాయకులు కొందరు ఆధారాలతో సహా పార్టీ కీలక నేత పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జిగా బొడ్డు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, వాటిలో పాల్గొనవద్దని అభిరామ్ హెచ్చరించడం వల్ల పార్టీ పుంజుకోవడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. అభిరామ్‌ను అదుపు చేయాలని కూడా వారు గట్టిగా సూచించారు. దీనిపై అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పల్లా శ్రీనివాసరావు ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.
సీఎం కో-ఆర్డినేటర్‌గా పెందుర్తి వెంకటేష్.. కుమారుడికి టికెట్ లక్ష్యం?:
మరోవైపు, పెందుర్తి వెంకటేష్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నిరంతరం సీఎంవో, సచివాలయం, పార్టీ కార్యాలయాల చుట్టూ కనిపిస్తుండగా, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను ఆయన కుమారుడు అభిరామ్ పర్యవేక్షిస్తున్నారు. దీన్ని బట్టి, వచ్చే ఎన్నికల్లో పెందుర్తి తనయుడు అభిరామ్‌ను పోటీకి నిలబెట్టే అవకాశం ఉందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఏది ఏమైనా, కీలకమైన రాజానగరం నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీ బలహీనపడడం సరికాదని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఈ వర్గపోరును ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.