తెలుగు దేశం పార్టీ.. జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీ ఇప్పుడు తాను ఓ ప్రాంతీయ పార్టీనని చెప్పకనే చెప్పుకుంటోంది. ఏపీ, తెలంగాణలకు ఆ పార్టీ ఇస్తున్న ప్రయారిటీలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇవాళ, రేపు ఒంగోలులో టీడీపీ మహా నాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలపై నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అయ్యింది. ఒంగోలులో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశమై ఇవాళ మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలపై చర్చించింది. మహానాడు తీర్మానాలకు టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది.


ఈ మహానాడు ప్రతినిధుల సభలో మొత్తం 17 తీర్మానాలు ప్రవేశ పెడతారట. ఇందులో ఏపీకి 12 తీర్మానాలు, తెలంగాణకు 3 తీర్మానాలు, అండమాన్ కు ఒక తీర్మానం ఉంటాయట. మహానాడులో ప్రవేశ పెట్టే రాజకీయ తీర్మానాలపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. ఈ తీర్మానాల సంఖ్యను చూస్తే ఆ పార్టీ ఏపీకి ఇచ్చే ప్రాధాన్యత అర్థమైపోతోంది. తెలంగాణలో పార్టీ పూర్తిగా నిరాశజనకంగా ఉండటంతో.. ఏదో నామ్‌ కే వాస్తేగా మూడు తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.


ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ విధానం ఉండాలనే రీతిలో రాజకీయ తీర్మానం ఉండాలని పొలిట్ బ్యూరో సభ్యులు అభిప్రాయపడ్డారట.  అలాగే వైసీపీ బస్సు యాత్రపై పొలిట్ బ్యూరోలో ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. వైసీపీ బస్ యాత్రను ప్రజలే పట్టించుకోవడం లేదని.. పార్టీ కూడా దాన్ని లైటుగానే తీసుకోవాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. బస్సు యాత్ర ఓ డ్రామా అంటూ పొలిట్ బ్యూరోలో చర్చ సాగినట్టు తెలుస్తోంది.


అలాగే వైసీపీకి మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో 4 గురు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారన్న విషయంపైనా టీడీపీ పొలిట్ బ్యూరో లో చర్చ సాగిందట. అలాగే 9 మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు బయట రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. ముగ్గురు జగన్ తో పాటు కేసుల్లో ఉన్న వారేనని పొలిట్ బ్యూరోలో నేతలు చర్చించారట. లాబీయింగ్ చేసేవారికి, కేసుల్లో సహ మద్దాయిలకు జగన్ రాజ్యసభ ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: