
దర్శకుడు క్రిష్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లోని డుడుమ జలాశయం, మచ్ఖండ్ విద్యుత్ కేంద్రం, వించి హౌస్, వ్యూ పాయింట్, బలడ గుహలు లాంటి విశేష ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఈ ప్రాంతాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా హాట్ టూరిస్ట్ స్పాట్స్‌గా మారిపోయాయి. సినిమాను థియేటర్‌లో చూడని వారు సైతం ట్రైలర్స్ లేదా సోషల్ మీడియా క్లిప్స్ ద్వారా ఈ లొకేషన్లను చూసి ఆ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పర్యాటకుల సంఖ్య పెరగడంతో అక్కడి చిన్న వ్యాపారులు కూడా లాభాలు పొందుతున్నారు. అంటే ఘాటీ డిజాస్టర్ అయినా, లొకేషన్లకు మాత్రం అదృష్టం కలిసొచ్చినట్లైంది.
అంతేకాక, ప్రస్తుతం గ్రీన్ మ్యాట్ యుగంలో ఎక్కువ సినిమాలు స్టూడియోల్లోనే షూట్ అవుతున్న తరుణంలో, క్రిష్ ఇంత రిస్క్ తీసుకుని రియల్ అవుట్‌డోర్ షూట్‌లు చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయి ఉంటే ఆ ప్రాంతాలు ఇంకో స్థాయికి వెళ్లేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఓటిటి విషయానికి వస్తే, ఘాటీ డిజిటల్ రిలీజ్ అక్టోబర్ 2న ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే భారీ మొత్తానికి హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్‌కు నాలుగు వారాల విండో కనక, ఆ తేదీకి రావడమే ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఘాటీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా, టూరిజం పరంగా మాత్రం గోల్డెన్ హిట్ కొట్టినట్లే!