కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. గత మూడు నెలల నుంచి ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్లకు బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ డబ్బులు జమ కాలేదు. ఈ సంవత్సరం మే నెల తొలి వారం నుంచి గ్యాస్ వినియోగదారుల బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ కావడం లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నగదును జమ చేయడం నిలిపివేసింది.
 
కేంద్రం సబ్సిడీ డబ్బులను జమ చేయకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. 2019 జూన్ నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతున్నాయి. అదే సమయంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. అందువల్ల సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్, సబ్సిడీ సిలిండర్ ధరలు దాదాపు సమానం అయ్యాయి. రెండింటి ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో మోదీ సర్కార్ నగదు జమ చేయడం లేదు.
 
సాధారణంగా కేంద్రం సంవత్సరంలో 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకు ప్రతి ఫ్యామిలీకి ఇస్తున్న సంగతి విదితమే. 12 గ్యాస్ సిలిండర్ల కంటే ఎక్కువ సిలిండర్లు కొనుగోలు చేస్తే సబ్సిడీ వర్తించదు. 14.2 కేజీల సిలిండర్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందించేది. ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా వినియోగదారుల ఖాతాలలో నగదు జమ కావడం లేదు. భవిష్యత్తులో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే మాత్రం మరలా సబ్సిడీ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
ఇకపోతే ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఒకటో తేదీన పెరిగిన లేదా తగ్గిన కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. మరోవైపు కేంద్రం కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తోంది. ఏప్రిల్ లో ఈ పథకం మొదలు కాగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు పథకం అమలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: