హైదరాబాద్ లో దొంగలు మళ్లీ జోరుగా చేతి వాటాన్ని చూపిస్తున్నారు.. పండుగ సందర్భంగా చాలా ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లి పోయారు. ఈ సందర్భంగా దొంగలకు అడ్డు లేకుండా పోయింది. నచ్చిన ఇంటిని చూసుకోవడం దొరికిన కాడికి దోచుకొని ఉడాయిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ నగరాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మేడ్చల్ లో భారీ చోరి జరిగింది. భారీగా జరిగిన చోరికి పోలీసులు అప్రమత్తం అయ్యారు.



వివరాల్లోకి వెళితే.. సొంతూళ్లకు వెళ్లిన విషయాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకున్నారు. ఒక్క రాత్రి లోనే పట్టణం లో ఏకంగా ఆరు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. సూర్యనగర్‌ కాలనీ సరిత రెసిడెన్సీలో మూడు ఇళ్లు, దానికి పక్కవీధిలోని మరో మూడు ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో 40 తులాల బంగారాన్ని , నగదును ఎత్తుకెళ్లి పోయారు.. మరో ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. మరో రెండు ఇళ్ల యజమానులు అందుబాటులో లేక పోవడం తో చోరికి గురైన వస్తువుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి..



చోరీలపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం క్లూస్ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. ఇక్కడ జరిగిన దొంగతనాలు పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చుట్టు పక్కల ఉన్న కాలనీల్లో సీసీ ఫుటేజీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. పండక్కి సొంతూళ్లకు వెళ్లిన వారు తమకు సమాచారమివ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగతనాలు జరగకుండా యజమానులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే విలువైన వస్తువులను ఊర్లకు వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్లాలని హెచ్చరించారు.. ఎటువంటి చోరీలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు తెలిపిన సూచనలను అనుసరిస్తే మంచిదని విజ్ఞప్తి చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: