ఏపీ అధికార పార్టీపై మరో కొత్త సమస్య వచ్చి పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఈ సమస్య ను వైసిపి కి కనెక్ట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు టిడిపి నేతలు. చేసింది కేంద్రమే కావచ్చు.. కానీ ప్లానింగ్ మాత్రం సీఎం జగన్ దే అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓవైపువ పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సమయంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సంచలనంగా మారింది. సాయం చేయకపోగా.. విశాఖ ఉక్కును నిట్టనిలువునా అమ్మేయాలని నిర్ణయించిన మోడీ ప్రభుత్వ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉద్యమ బాట పడుతుంటే.. ప్రైవేటీకరణ సమస్య రాజకీయ పార్టీల్లోనూ కాక రేపుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక వైయస్ జగన్ కూడా ఉన్నారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు టిడిపి నాయకులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని తమ వారికి కట్టబెట్టేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్రం స్తంభించే ఈ వార్తను కేంద్రం ప్రకటించిన వెంటనే   అన్ని పార్టీ నాయకులందరూ నిరసన తెలుపుతూ గళమెత్తారు. కానీ అసలు బాధ్యత ఉన్న అధికార పార్టీ వైసిపి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఎంతకీ స్పందించడం లేదంటూ వైసీపీని కార్నర్  చేసింది టిడిపి. తాజాగా, విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

 విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. తన రాజీనామా లేఖను ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు కూడా పంపించారు. పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని  పిలుపునిచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ ఈ సమస్యపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇలా అన్ని వైపుల నుండి  ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు. ఈ విషయంపై స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాకు ఆందోళన ఉంది. కానీ సమస్య ముందుకు పోనప్పుడు.. మాట్లాడి ప్రయోజనం ఉండదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను  అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని నిందించాలి అనుకుంటున్నారు.. కానీ అన్నీ తెలిసిన ప్రజలు దీన్ని నమ్మరు. విశాఖ మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ ఉంది. కేంద్రం ప్రకటన మాత్రమే చేసింది. దీనిపై ముందడుగు వేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అన్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. కానీ అదంతా ఒక నాటకం  దొంగ రాజీనామా. స్పీకర్ ఫార్మాట్‌లో లేదు. ఇలాంటి ఉత్తుత్తి రాజీనామాలు మేం చాలా చూశాం. గంటా కంటే ఎక్కువగా బాధ్యత మాకు అంటూ ప్రతి విమర్శలు చేశారు అంబటి...

మరింత సమాచారం తెలుసుకోండి: