వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అందులోనూ మున్సిపల్ ఎన్నికల ముంగిట ఈ వివాదం రాజుకోవడం వైసీపీకి సంకటంగా మారింది. అందుకే.. ఇప్పుడు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని.. కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎం జగన్‌, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు.


కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని జగన్ మోడీకి రాసిన లేఖలో తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశమని..  స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయని తెలిపారు. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తానని... ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతానని లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తానన్న జగన్.. ప్లాంట్‌పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ లేఖ రాశారు.


అయితే జగన్ లేఖపై ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లో చర్చ నడుస్తోంది. కేవలం ప్రధానికి లేఖలు రాస్తే ఫలితం ఉండదని.. చిత్తశుద్ధితో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అంటున్నారు. సమస్యకు తగిన పరిష్కారాలను కేంద్రం ముందు ఉంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. విశాఖ ఉక్కు నష్టాల్లో కూరుకుపోవడానికి కారణాలపై సమగ్ర అధ్యయనం చేసి.. సరైన మార్గాలతో ప్రధాని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.


ఈ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తుతం అన్ని పార్టీలు తమ తమ రాజకీయ లబ్ది మేరకు స్టాండ్ తీసుకుంటున్నాయి తప్ప... సమస్యకు అసలైన పరిష్కారాలను సూచించడం లేదన్న విమర్శ ఉంది. రాజకీయాలను పక్కకు పెట్టి.. రాజకీయ ప్రయోజనాలను పక్కకుపెట్టి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం అందరినీ కలుపుకుని వెళ్తే.. పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. అంతే తప్ప.. రాజకీయాల దృష్టి కోణంలో పార్టీలు పోరాటం చేస్తే ప్రయోజనం శూన్యమని గత అనుభవాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: