ఏపీలో ఈరోజునుంచి ప్రభుత్వ స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. అయితే విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లు మాత్రమే స్కూళ్లకి వస్తారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, సామాజిక దూరం మెయింటెన్ చేస్తూ.. టీచర్లు స్కూళ్లకు వస్తారు. అయితే వారిలో కూడా కేవలం 50శాతం మందికి మాత్రమే ప్రవేశం. రోజు మార్చి రోజు రెండు బ్యాచ్ లు గా టీచర్లు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. ఎవరెవరు ఎప్పుడు వస్తారు, ఏరోజు సెలవు తీసుకుంటారనే విషయాన్ని హెడ్ మాస్టర్ నిర్ణయిస్తారు.

పిల్లల సంగతేంటి..?
తెలంగాణ ప్రభుత్వం కూడా జులై-1నుంచి పిల్లలను స్కూళ్లకు అనుమతిచ్చేలా ఆదేశాలిచ్చి ఆ తర్వాత ఆన్ లైన్ బోధనంటూ వెనక్కి తగ్గింది. అయితే ఏపీ సర్కారు మాత్రం పిల్లల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి మాత్రం పిల్లలు స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదు. రేపటినుంచి 15రోజులపాటు పిల్లల సిలబస్, వారికి ఇవ్వాల్సిన హోమ్ వర్క్ కోసం టీచర్లు ప్రణాళిక రచించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిల్లల బదులు, వారి తల్లిదండ్రుల్ని స్కూల్స్ కి పిలిపించి వర్క్ షీట్లు ఇస్తారు. థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో పిల్లల్ని స్కూళ్లకు పిలిపించడం కంటే, తల్లిదండ్రుల్ని స్కూళ్లకు రప్పించి వారికి మెటీరియల్ ఇవ్వడం కరెక్ట్ అని భావిస్తోంది ఏపీ విద్యాశాఖ.

స్మార్ట్ ఫోన్లు ఉన్నవారిని గుర్తించి వారితో వాట్సప్ గ్రూప్ లు క్రియేట్ చేసి ఆన్ లైన్ బోధనకు మార్గం సుగమం చేస్తారు. కొవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మాత్రమే పిల్లల్ని స్కూళ్లకు అనుమతిస్తారు. రేడియో, టీవీ ద్వారా విద్యాబోధన షెడ్యూల్స్ ని ఎస్సీ ఈఆర్టీ విడుదల చేయాల్సి ఉంది. ఈలోగా టీచర్లు కూడా దానిపై ఓ స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంది. కొవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నా.. జులై -15నుంచి మాత్రం తల్లిదండ్రుల్ని పిలిపించి వర్క్ షీట్లు ఇస్తారు. వాటిని కరెక్ట్ చేసి తిరిగి అదే తరహాలో వర్క్ షీట్లు తయారు చేయడానికి టీచర్లను సమాయత్తం చేస్తున్నారు అధికారులు.

మరోవైపు జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు-నేడు వంటి కార్యక్రమాలు కూడా సమర్థంగా జరిగేందుకు టీచర్లు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. జగనన్న విద్యాకానుక కిట్ లు, స్కూళ్లకు చేరుకునే సమయానికి వాటిని పంపిణీ చేసేందుకు వీలుగా టీచర్లు సిద్ధం కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: