గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా ఒకప్పుడు విపరీతంగా జరిగేది. అప్పట్లో అడిగిన వెంటనే గ్యాస్ కనెక్షన్ ఇచ్చేవారు కాదు, బుక్ చేసిన వెంటనే సిలిండర్ డెలివరీ అయ్యేది కాదు. దీంతో చాలామంది అధికారికంగా సిలిండర్లకోసం అగచాట్లుపడలేక బ్లాక్ మార్కెట్ వైపు చూసేవారు. కానీ రాను రాను ఆ పరిస్థితి లేదు. గ్యాస్ సిలిండర్లకోసం కనెక్షన్ తీసుకోవడం సులభం అయింది. ఇలా బుక్ చేస్తే, అలా మరుసటి రోజు సిలిండర్ డెలివరీ వచ్చేస్తుంది. దీంతో బ్లాక్ మార్కెట్ అనేది దాదాపుగా కనుమరుగైందనే చెప్పాలి. దాంతోపాటు.. గృహ అవసరాలకు వాడే సిలిండర్లు, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల రేట్లలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో చాలామంది బ్లాక్ మార్కెట్ జోలికి వెళ్లలేదు. కానీ మళ్లీ పాత పరిస్థితులే పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం గ్యాస్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ రేటు వెయ్యి రూపాయలకు చేరువ కాబోతోంది. అదే సమయంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్ల రేట్లు ఇటీవల మరింత ఎక్కువగా పెరిగాయి. దీంతో మరోసారి బ్లాక్ మార్కెట్ దందాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. ప్రస్తుతం 19కిలోల వాణిజ్య సిలిండర్ రేటు 2120 రూపాయల వరకు ఉంది. ప్రాంతాలను బట్టి ఈ రేటు మారుతోంది. 14 కేజీల గృహ వినియోగ సిలిండర్ రేటు 920 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ రేటు కూడా మారుతుంది.

మొత్తంగా కమర్షియల్ సిలిండర్ లో కేజీ గ్యాస్ ధర 112 రూపాయలు ఉంటే.. డొమెస్టిగ్ గ్యాస్ కేజీ ధర 65రూపాయలకు చేరువలో ఉంటోంది. దీంతో చాలామంది గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. చిరు వ్యాపారులు ఆల్రడీ అదే పని మొదలు పెట్టారు. పెద్ద పెద్ద హోటళ్ల నిర్వాహకులు కూడా గ్యాస్ రేట్లు తట్టుకోలేక గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను తీసుకుంటున్నారని సమాచారం. గ్యాస్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో.. దాన్ని తట్టుకోలేక ఈ పని చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా.. హోటళ్లలో తినుబండారాల రేట్లు పెంచితే పోటీ తట్టుకోలేమని, అందుకే ఈ పని చేయాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తమ్మీద గ్యాస్ రేట్లు పెంచేసిన కేంద్రం.. పరోక్షంగా బ్లాక్ మార్కెట్ దందాకు కారణం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: