విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో బొత్స మాట్లాడారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే రైతుల‌కు మేము ఎప్పుడు న్యాయం చేస్తాం అని పేర్కొన్నారు. చెరుకు రైతుల ఆవేద‌న‌ను అర్థం చేసుకున్నాం. మాకు రైతుల సంక్షేమ‌మే ముఖ్యమ‌ని వెల్ల‌డించారు. లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులు తిరగబడటంలో తప్పు లేదని స్ప‌ష్టం చేశారు. ఎన్‌సీఎస్ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ ప్ర‌యివేటు యాజ‌మాన్యం 2015 నుంచి ఇదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని తెలిపారు. 2019 లో రూ. 25 కోట్ల  బాకీ పడితే ఆర్.ఆర్ యాక్ట్ కింద 30 ఎకరాలు అమ్మి బకాయిలు తీర్చామని స్ప‌ష్టం చేశారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే రూ.25 కోట్లు బాకి ఉన్న‌దని.. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడ ఆ ప్ర‌స్తావ‌న తాను తీసుకొచ్చిన‌ట్టు గుర్తు చేశారు మంత్రి బొత్స‌. అయితే ఇప్పుడు కొంత మంది నేత‌లు రూ.90 కోట్లు అప్పు ఉన్న‌ట్టు పేర్కొంటున్నార‌ని, అది వాస్త‌వం కాద‌ని వెల్ల‌డించారు. కేవ‌లం రూ.16కోట్ల బ‌కాయిలు మాత్ర‌మే ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా రైతుల మీద లాఠీ చార్జీ జ‌రిగింద‌న‌డం స‌రైంది కాద‌న్నారు. దాదాపుగా రైతులు 80వేల ఎక‌రాల‌లో చెరుకు వేశార‌ని, ఆ రైతుల‌ను ఏ విధంగా ఆదుకోవాల‌నేది మా ముందు ఉన్న ఛాలెంజ్ అని పేర్కొన్నారు.


షుగర్ ఫ్యాక్టరీ వద్ద నుండి దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే 30 వేల బస్తాలు షుగర్ ను స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు. ప్రస్తుతానికి రూ.16 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని అధికారులు చెప్పిన‌ట్టు బొత్స పేర్కొన్నారు. ఆ బ‌కాయిల‌ను ఎలా తీర్చాలో ఆలోచ‌న చేశాం. యాజ‌మాన్యానికి ఇంకా 24 ఎక‌రాలు ఉన్నాయి. ఆర్ఆర్ యాక్ట్ కింద వాటిని త్వ‌ర‌లో అమ్మి బ‌కాయిల‌ను చెల్లిస్తాం అని వివ‌రించారు. రైతులు ప్ర‌తిప‌క్షాల మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని, రైతుల‌కు మేలు చేసేందుకే ప్ర‌భుత్వం ఉన్న‌ద‌ని.. కొంత మంది రైతులు పోలీసుల మీద రాళ్ల దాడి చేసినా పోలీసులు మాత్రం సంయ‌మ‌నం పాటించార‌ని బొత్స వెల్ల‌డించారు.  కమ్యూనిస్టు పార్టీ ప్రోద్బలంతో టీడీపీ అందదండలతో పోలీసులు మీద తిరగబడేటట్టు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా గంజాయి గురించి మాట్లాడే హ‌క్కు చంద్ర‌బాబుకు లేద‌ని, పోలీస్ వ్య‌వ‌స్థ‌పై నింద‌లు వేయ‌డం స‌రికాద‌ని, రాజ‌ధాని ఉద్య‌మం రైతుల‌ది కాదు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ది అని బొత్స స్ప‌ష్టం చేశారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: