హుజురాబాద్ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్ర బీజేపీలో నూతన ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలను  రచిస్తోంది. అలాగే అసెంబ్లీలో ఇప్పటికే రెండు స్థానాలను పెంచుకున్న బిజెపి మరో స్థానం పై గురి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి హుజురాబాద్ తర్వాత తెలంగాణలో మరో ఉప ఎన్నికకు అవకాశం ఉందనే వాదనలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. పౌరసత్వ వివాదం వ్యవహారంలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ శాసనసభ్యత్వాం రద్దు అవుతుందనే భావనలో బిజెపి ఉంది. ఒకవేళ వేములవాడకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేకపోతే  ఏం చేయాలనే దానిపై కూడా ఆ పార్టీ ఓ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో రాజీనామా చేయించి ఆయనను బిజెపి తరఫున పోటీ చేయించాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వివిధ కారణాలతో హుజూర్ నగర్, నాగార్జునసాగర్, హుజురాబాద్ , దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి. హుజూర్ నగర్,నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ గెలవగా, దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గం లో బిజెపి గెలిచింది. ఇప్పుడు మరిన్ని ఉపఎన్నికలు వస్తే తమ బలం పెరుగుతుందని బిజెపి భావిస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినీ కొద్ది నెలలుగా ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని కూడా ఆయన మాట్లాడారు. అలాగే బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, తన సమయం చూసుకొని బీజేపీలోకి వెళ్తానని గతంలోనే తెలిపారు. అయితే ఇదంతా ఏడాది కిందట ప్రచారం. కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి గెలవడంతో కోమటిరెడ్డి ఆ పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బీజేపీలో చేరిక ఖాయం అయిందని ఒకటి, రెండు నెలల్లో రాజగోపాల్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకోవచ్చు అన్న ప్రచారం బిజెపి వర్గాల్లో జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరనున్నారని బీజేపీ వర్గాల ప్రచారాన్ని బట్టి తెలుస్తోంది. దీన్నిబట్టి మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుంది అని అర్థమవుతుంది. అయితే ఆ రిస్క్ కోమటిరెడ్డి తీసుకుంటారా అనేది డౌట్. ఉప ఎన్నిక వస్తే ఆర్థికంగా ఇబ్బందులు  వస్తాయి. మళ్లీ రెండేళ్లలో ఎలాగూ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు కోమటిరెడ్డి రిస్కు చేయడం  కష్టమే. అదే ఆలోచన ఇప్పటికే ఆయన తన అనుచరులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: