వరుణుడు పగబట్టాడా... ప్రకృతి కన్నెర్ర చేసిందా... పరిస్థితి చూస్తే నిజమే అనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల కారణంగా పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన వెంటనే భారీ వర్షాలు... ఇలా దాదాపు పక్షం రోజులుగా దక్షిణ భారతాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలు వరద దాకిడికి అల్లాడిపోతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల ఎకరాల్లో పంట కోతకు గురైంది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. తిరుపతి నగరం మూడు రోజులు పాటు నీటిలో నానిపోయింది. తిరుమలకు వచ్చే అన్ని మార్గాలను కూడా రెండు రోజుల పాటు మూసివేశారు అధికారులు. పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి.

ఇప్పుడు మరో గండం ప్రజలను గడగడ లాడిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టిందని సంతోష పడేలోపే... వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక భయపెడుతోంది. బంగావలాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండం ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన తమిళ సర్కార్... పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జలాశయాలన్ని నిండుకుండలను తలపిస్తుండటంతో... దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాలపై వరుణ ప్రభావం అధికాంగా ఉంటుందన్నారు. పుదుచ్చేరి, కరైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో అటు శ్రీలంక, ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: