పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చలకంటే కూడా వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ప్రధాన పార్టీల నేతలు. ఉభయ సభలు ప్రారంభమై ఇప్పటికే వారం గడుస్తున్నా కూడా... కనీసం ఒక అంశంపై కూడా క్లారిటీ రాలేదనేది రాజకీయ విమర్శకుల మాట. ఇక హుందాగా జరగాల్సిన పెద్దల సభ కూడా రసాభాసగానే సాగుతోంది. ప్రతి అరగంటకు ఓ సారి వాయిదాల పర్వం నడుస్తోంది. రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశం సభలో ప్రతిష్ఠంభనకు కారణమైంది. సస్పెన్షన్ ఎత్తి వేయాలంటూ నాలుగు రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర సస్పెండ్ అయిన ఎంపీలు నాలుగు రోజులుగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. వీరికి తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ కూడా సంఘీభావం తెలిపారు. వీరిద్దరు కూడా సస్పెండైన ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఇక సస్పెన్షన్ ఎత్తి వేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో విపక్షాలు చర్చలు జరిపాయి.

రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాయి విపక్షాలు. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం వినూత్నంగా స్పందించింది. సభలో అనుచితంగా ప్రవర్తించారని... అందువల్ల వారితో క్షమాపణ చెప్పించాలని కేంద్రం డిమాండ్ చేస్తోంది. అప్పుడే సస్పెన్షన్ ఎత్తివేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. అయితే 12 మంది సభ్యులను ఏ నిబంధన కింద సస్పెండ్ చేశారో చెప్పాలని ప్రతిపక్షాలు పట్టు బడుతున్నాయి. ఇదే సమయంలో క్షమాపణం చెప్పాలనే డిమాండ్ కూడా సరి కాదన్నారు విపక్ష నేతలు. దీంతో ఈ రోజు కూడా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో జరిపిన సఫలం కాలేదని విపక్ష నేతలు వెల్లడించారు. సభలో ఏం జరిగిందో దేశమంతా చూసిందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. సభలో జరిగిన ప్రతి విషయం రికార్డుల్లో ఉందని... అందువల్ల సభకు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ రద్దు చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు ప్రహ్లాద్ జోషీ. అటు ధాన్యం కొనుగోలు వ్యవహారం తేలే వరకు సభకు హాజరయ్యేది లేదని టీఆర్ఎస్ ఎంపీలు కూడా రాజ్యసభ ఛైర్మన్‌కు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: