గత రెండు రోజులుగా దేశంలోని ఇన్ని మీడియాల్లో కూడా ఒకటే వార్త. ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం వార్తను మాత్రమే యూ ట్యూబ్ ఛానల్ స్థాయి నుంచి నేషనల్ మీడియా వరకు ప్రసారం చేస్తున్నాయి. తమిళనాడులోని కూనూర్ వద్ద నీలగిరి అడవిలో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో దేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా.. మొత్తం 13 మంది దుర్మరం పాలయ్యారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు ప్రమాద స్థలి నుంచి హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. ప్రమాదానికి కారణాలను ఇప్పటికే విశ్లేషిస్తున్నారు. మరో రెండు నిమిషాల్లో గమ్యం చేరాల్సిన హెలికాఫ్టర్ దట్టమైన మంచు కారణంగా కూలిపోయింది. ఇండియన్ ఆర్మీలోనే అత్యంత శక్తివంతమైన హెలికాఫ్టర్‌గా రష్యన్ మేడ్ ఎంఐ-17 వీ5 చాపర్‌కు గుర్తింపు ఉంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా నడవగల సామర్థ్యం ఉన్న హెలికాఫ్టర్ ఇది.

ఈ ప్రమాదంపై ప్రస్తుతం మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఎన్నో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు ఊహజనిత వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమాదం అలా జరిగిందని కొందరూ... ఇది ఉగ్రవాదుల కుట్ర అని మరికొందరు పోస్టులు చేస్తున్నారు కూడా. అసలు హెలికాఫ్టర్ సామర్థ్యంపై కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో భారత వాయుసేన స్పందించింది. ప్రమాదంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని సూచించింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కూడా భారత వైమానిక దళం... ఐఏఎఫ్ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది భారత వాయుసేన. ప్రమాద ఘటనపై ఇప్పటికే దర్యాప్తు వేగంగా జరుగుతుందని... సాధ్యమైనంత త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై ఇప్పటికే వైమానిక దళం ట్రై సర్వీస్ కోర్డు ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుందని... ఈ విచారణ త్వరలోనే పూర్తి అవుతుందని కూడా ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: