దేశంలోనే అత్యంత వేగంగా విస్త‌రిస్తున్నన‌గ‌రాల్లో ఒక‌టిగా కాస్మోపాలిట‌న్ సిటీగా పేరొందిన హైద‌రాబాద్ లో ప‌బ్ క‌ల్చ‌ర్ అంత‌కంత‌కూ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టిదాకా వీటిపై అంత‌గా దృష్టి పెట్ట‌ని తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న చ‌ర్య‌ల‌తో వీటిని నియంత్రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. సిటీలోని ప‌బ్‌ల‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ క‌ఠిన‌మైన ఆంక్ష‌లు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. విప‌రీత‌మైన సౌండ్ పొల్యూష‌న్ వెలువ‌రిస్తున్న ప‌బ్‌ల‌కు నియ‌మావ‌ళిని రూపొందిస్తూ డీజే, లైవ్ బ్యాండ్‌పై ఆంక్ష‌లు విధిస్తూ వాటిపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణ‌యించింది. అంతేకాదు.. ఈ ప‌బ్‌ల కార‌ణంగా వెలువ‌డే ధ్వ‌ని కాలుష్యంతో ఇబ్బందిప‌డేవారెవ‌రైనా స‌రే 100 నెంబ‌ర్‌కు డ‌య‌ల్ చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని కూడా  తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్ర‌క‌టించింది. ప‌రిమితికి మించిన ధ్వ‌నులు, చిత్తం వ‌చ్చిన‌ట్టు ర‌ణ‌గొణ‌ధ్వ‌నులతో ప‌బ్‌ల నిర్వాహ‌కులు స్థానికుల‌ను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించింది. ఈ దిశ‌గా స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా జూబ్లీ హిల్స్ ఎక్సైజ్ పోలీసుల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఐటీ రంగం భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న క్ర‌మంలో వివిధ ప్రాంతాల‌కు చెందిన యువ‌త ఉపాధి కోసం ఇక్క‌డికి భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. వీరిలో ప‌లు రాష్ట్రాల‌కు చెందిన‌వారు మాత్ర‌మే కాదు.. విదేశాల‌కు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే అప్ప‌టిదాకా ప‌బ్ క‌ల్చ‌ర్ అంటే తెలియ‌ని న‌గ‌రానికి ఈ సంస్కృతి అల‌వాటైంది. ఆధునిక‌త‌కు ఇదో సింబ‌ల్‌గా భావించే యువ‌త కూడా పెరిగింది. గ్రామీణ ప్రాంతం నుంచి వ‌చ్చిన యువ‌త కూడా నెమ్మ‌దిగా ఈ క‌ల్చ‌ర్‌కు అల‌వాటు ప‌డుతున్నారు. ఇందులో యువ‌తీ యువ‌కుల వ్య‌త్యాసం ఉండ‌టం లేదు. ప‌బ్‌ల్లో ప‌లు వివాదాలు త‌లెత్త‌డం, అవి కేసుల వ‌ర‌కు దారితీయ‌డం కూడా జ‌రుగుతోంది. మ‌రోప‌క్క డ్ర‌గ్స్ కేసులు కూడా పెరుగుతుండ‌టం, వీరిలో ప‌లువురి సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌ట‌కురావ‌డం, ఈ అంశంపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ప‌బ్‌ల నిర్వ‌హ‌ణ‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఉన్న‌ట్టు గ‌తంలో వార్త‌లు కూడా వ‌చ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: