దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఒకేసారి కాకుండా మెల్ల మెల్లగా వడ్డిస్తోంది కేంద్రం. దీంతో వాహనాల రంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ రేట్లను పెంచింది, ఏపీలో కూడా ఆర్టీసీ టికెట్ రేట్లు పెరిగే అవకాశముంది. గతంలో పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు కూడా ఏపీలో ఆర్టీసీ టికెట్లపై భారం వేయలేదు. దీంతో ఈసారి అదీ ఇదీ కలిపి ఒకేసారి వడ్డిస్తారనుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఆర్టీసీ రేట్ల పెంపుతోపాటు.. ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు కూడా రేట్లు పెంచక తప్పనిసరి పరిస్థితి. కానీ అక్కడ క్యాబ్ లు నిర్వహణ ప్రైవేట్ కంపెనీల చేతిలో ఉండటంతో.. వారు కమిషన్ పెంచితేనే డ్రైవర్లకు గిట్టుబాటవుతుంది. కానీ ఓలా, ఉబెర్ కంపెనీలు ఇప్పుడప్పుడే కమిషన్ ని సవరించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో డ్రైవర్లు కొత్త ఆలోచన చేశారు. క్యాబ్ లలో ఏసీలు ఆఫ్ చేస్తున్నారు. అదేమంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయంటున్నారు.

హైదరాబాద్ నగరంలో సొంత వాహనాలు లేనివారు క్యాబ్‌  సర్వీసులపై ఆధారపడుతుంటారు. వీరిలో చాలా మంది ఉబెర్, ఓలా సర్వీసులను వినియోగిస్తుంటారు. దగ్గరైనా, దూరమైనా.. కష్టంలేని ప్రయాణం కోసం చాలామంది క్యాబ్ సర్వీసులపై ఆధారపడుతుంటారు. నేరుగా గమ్య స్థానానికి చేరుకోడానికి ఆర్టీసీ, ప్లస్ ఆటో.. ఇలా రెండూ ఎక్కడం కంటే నేరుగా ఇంటికే క్యాబ్ ని పిలిపించుకుని, గమ్యస్థానం చేరుకోవడం సులభంగా ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా కస్టమర్లకు చుక్కలు చూపెడుతున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ ఫాం వర్కర్స్ యూనియన్ తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌ లలో ఏసీలను ఆపేస్తున్నట్టు యూనియన్ ప్రకటించింది. ఏసీ ప్రయాణం కావాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. వేసవిలో ఉక్కపోతను ఎవరూ తట్టుకోలేరు. ఏసీ లేకుండా ప్రయాణం చేయలేరు. అందుకే ఇలాంటి షాకిచ్చింది వర్కర్స్ యూనియన్.

ఒకవేళ ఓలా, ఉబెర్ క్యాబ్‌ లో ప్రయాణించేవారు ఏసీ సౌకర్యం కావాలని అడిగితే.. అదనంగా రూ.25 చార్జ్ చేస్తారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఏసీపో క్యాబ్ లు నడపడం మరింత ఖర్చుతో కూడిన వ్యవహారం అవుతోంది. సదరు సంస్థలు ఇచ్చే కమీషన్ దానికి సరిపోవడంలేదు. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు క్యాబ్ డ్రైవర్లు. దీంతో ఓలా, ఉబెర్ లాంటి కంపెనీలు కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే ఆటో చార్జీలు కూడా తెలంగాణలో భారీగా పెరిగాయి. ఇక క్యాబ్ చార్జీలు కూడా మోతమోగిపోబోతున్నాయని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: