ఏపీలో ఇప్పటికే మొదలైన పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీతో ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ దశలో సిబ్బందిపై మరింత నిఘా పెడుతోంది ప్రభుత్వం. ముఖ్యంగా సెల్ ఫోన్ల విషయంలో కఠినంగా ఉండాలనుకుంటోంది. ఏపీలో ఇంటర్ పరీక్షలు ఈరోజుతో మొదలై.. ఈనెల 24 వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకోసం 1,456 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

సెల్ ఫోన్లపై ఆంక్షలు..
టెన్త్ క్లాస్ పరీక్షల విషయంలో జరిగిన లీకేజీల వ్యవహారంతో ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎగ్జామ్ సెంటర్లలో గదుల బయట, లోపల సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ఈ కెమెరాల ద్వారా నిత్యం పరీక్ష వ్యవహారాలపై నిఘా పెడతారు. పరీక్ష జరిగే విధానాన్ని ఎప్పడికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. ఆ సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డ్ ఆఫీస్ కి అటాచ్ చేస్తారు. ఆన్‌ లైన్‌ స్ట్రీమింగ్‌ సౌకర్యం ద్వారా బోర్డ్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారు.

సెల్‌ ఫోన్ల ద్వారా టెన్త్ క్లాస్ ప్రశ్నా పత్రాలు లీక్ కావడంతో.. ఈ సారి ఇంటర్ కి అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అన్ని పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియట్ అధికారులు నో ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు, పర్యవేక్షిస్తున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు కూడా ఫోన్లు తీసుకు రాకూడదని చెబుతున్నారు. ఇతర డిజిటల్‌ పరికరాలను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకొని వచ్చే సమయంలో అధికారులు, సిబ్బంది.. పోలీస్ స్టేషన్లలోనే వారి సెల్ ఫోన్లు డిపాజిట్ చేయాలని చెబుతున్నారు ఉన్నతాధికారులు. దీంతో పరీక్ష కేంద్రాల నిర్వహణ సిబ్బంది షాకయ్యారు. ఇక పరీక్ష విధుల్లో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా తమ సెల్ ఫోన్లను చీఫ్ సూపరింటెండెంట్ వద్ద డిపాజిట్ చేయాలంటున్నారు. ఫోన్లపై ఆంక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చే సిబ్బంది హడలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: