అంతశయ్యకు మీదకు చేరిన రోగిలాగుంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో మిణుకుమిణుకు మంటున్నదంతే. ఎక్కడైనా నాలుగు స్ధానాలకు ఉపఎన్నికలు జరిగినపుడు అందులో ఒకటో లేకపోతే రెండు స్ధానాల్లో గెలుచుకుని తానింకి బతికే ఉన్నానని కాంగ్రెస్ జనాలకు గుర్తుచేస్తోంది. అంతర్గత వివాదాలు పెరిగిపోవటం, అవినీతి, గ్రూపు గొడవలు తారాస్ధాయికి చేరుకోవటం లాంటి అనేక రుగ్మతల కారణంగానే పార్టీ ఇప్పటి దుస్ధితిలో పడిపోయింది.





ఒకవైపు నరేంద్రమోడీ ఇమేజి బాహుబలి టైపులో ఆమాంతం పెరిగిపోయింది. సమీప భవిష్యత్తులో బీజేపీని ఢీకొట్టేంత సీన్ కాంగ్రెస్ కు లేదని యావత్ దేశప్రజలు దాదాపుగా అంగీకరించేశారు. ఇలాంటి పార్టీకి పూర్వపు జవసత్వాలు రావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాల్సిందే తప్ప మామూలుగా అయితే రాదు. ఇలాంటి అద్భుతమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి చర్యవల్ల జరగబోతోందని సీనియర్లు, జూనియర్లు అందరు ఎదురు చూస్తున్నారు.





అలాంటి అద్భుతం ఏమిటంటే తొందరలోనే రాహుల్ దేశవ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి పార్టీని పునరుత్తేజం కల్పించటమే టార్గెట్ గా యాత్ర మొదలవ్వబోతోంది. అక్టోబర్ 2వ తేదీ గాంధీజయంతి రోజున కన్యాకుమారిలో పాదయాత్ర మొదలవుతుందట. 148 రోజులు  12 రాష్ట్రాల్లోని 203 లోక్ సభ నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుంది.  





రాహుల్ పాదయాత్ర పుణ్యమాని దూరమైపోయిన జనాలు మళ్ళీ కాంగ్రెస్ వైపు వస్తే సరి లేకపోతే అంతే సంగతులు. తొందరలో మొదలవ్వబోయే పాదయాత్ర ఫలితం 2024 ఎన్నికల్లో తెలిసిపోతుంది. తాను సీరియస్ రాజకీయాలే చేస్తున్నట్లు, మోడీకి సరైన ప్రత్యామ్నాయం తానే అని రాహుల్ నమ్మించి, మెప్పించగలిగితే జనాలు మళ్ళీ కాంగ్రెస్ ను ఆధిరిస్తారు. లేకపోతే బహుశా 2024 ఎన్నికలే పార్టీకి చివరివి అవుతాయేమో. తర్వాత పార్టీ ఉండదా అంటే ఉంటుంది. వానపామును రెండుగా కట్ చేస్తే చెరో ముక్కు చెరోవైపుకు వెళిపోతుందంటారు. అలాగే కాంగ్రెస్ కూడా దేశంలో ఏదో మూల అలా పాకుతు, దేకుతు ఉంటుందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: