ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఉన్నావ్ కు చెందిన ఒక యువతి సంవత్సరం క్రితం అత్యాచారానికి గురైంది. అత్యాచార కేసు విచారణలో భాగంగా కోర్టుకు వెళుతున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాల పాలైన బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. 
 
భారతదేశమంతటా ఉన్నావ్ ఘటనపై అట్టుడికిపోతుంది. ఉన్నావ్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఉన్నావ్ ఘటన బాధితురాలి మృతికి సీఎం సంతాపం తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఉన్నావ్ ఘటనపై విచారణకు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటన చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దిశ కేసులోని నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంతో ఉన్నావ్ కేసు నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి.  
 
దేశవ్యాప్తంగా ప్రజలు ఉన్నావ్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలను ఇప్పటికే ఉధృతం చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ గేటు దగ్గర బైఠాయించారు. ఉన్నావ్ ఘటన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. 
 
ఇలాంటి దురాగతాలు జరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అఖిలేష్ అన్నారు. లక్నోలో అసెంబ్లీ ఎదుట అఖిలేష్ ధర్నాకు దిగారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యాచార నిందితులను శిక్షించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అత్యాచార ఘటనలు పెరిగాయని అన్నారు. రేపు ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్నావ్ ఘటనకి నిరసనగా ఆందోళనలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ వద్ద ముగ్గురు నలుగురు మాత్రమే దర్శనం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: