అవును.. ఏపీ గంజాయి మత్తులో తూగుతోంది.. అంటే.. నిజమైన గంజాయి మత్తుకాదు.. గంజాయి రాజకీయాల మత్తు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో గంజాయి డోసు పెరిగింది. గంజాయి కేంద్రంగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం గుజరాత్‌లోని ఓ పోర్టులో వెలుగు చూసిన భారీ డ్రగ్స్ దందాతో ఏపీకి లింకు ఉందంటూ వచ్చిన వార్తలతో మొదలైన ఈ గంజాయి రాజకీయం ఇప్పుడు తారస్థాయికి చేరింది.


గంజాయి అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంటే.. ఆ ప్రచారాన్ని అడ్డుకునేందుకు జగన్ సర్కారు తంటాలు పడుతోంది. తెలుగు దేశం ఈ విషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని చెప్పక తప్పదు. ఏపీలో గంజాయి కొత్త కాదు.. ఏపీ కేంద్రంగా ఇతర రాష్ట్రాలకూ గంజాయి వెళ్తోందన్నదీ కొత్త కాదు.. విశాఖ మన్యంలో గంజాయి సాగు అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే.. దీన్ని అరికట్టేందుకు చాలా ఏళ్లుగా చర్యలు తీసుకుంటున్నా వాటిలో చిత్తశుద్ధి కొరవడింది.


ఇది ఇలా ఉంటే.. అసలు గంజాయి మొక్కలు నాటిందే జగన్ అన్నరీతిలో టీడీపీ సర్కారు ప్రచారం మొదలుపెట్టింది. అంతే కాదు.. ఏపీ దేశంలోనే గంజాయి హబ్‌గా మారిందంటూ ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువుతీస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన పట్టాభి బూతులు.. వైసీపీ దాడుల ఘటనలు గంజాయి రాజకీయాన్ని మరింత మత్తెక్కించాయి. ఈ గంజాయి ఇష్యూ.. దాడుల అంశాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు టీడీపీ హస్తిన యాత్ర ఆరంభిస్తే.. అసలు విశాఖ మన్యంలో గంజాయి సాగు తీరు తెన్నులను వివరిస్తూ వైసీపీ నేతలు పాత విషయాలను బయటకు తెస్తున్నారు.


అసలు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే విశాఖ మన్యంలోని కొన్ని మండలాల్లో గంజాయి సాగు దివ్యంగా సాగుతోంది. దాదాపు 9 మండలాల్లోని దాదాపు 50 గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోందని ఏపీ ప్రభుత్వమే చెబుతోంది. మరి జగన్ సర్కారు ఇకనైనా దీన్ని అరికట్టేందుకు చిత్త శుద్ధితో చర్యలు తీసుకుంటే ఏపీని ఈ మత్తు నుంచి కాపాడిన వారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: