నేను మంత్రిని. నేను చెప్పిందే వేదం. మీరు నామాట వినాల్సిందే… మంత్రిగారు వస్తున్నారు, అలెర్ట్‌గా ఉండండి. చిన్న పొరపాటు జరిగినా తిప్పలు తప్పవు ఇవి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో తరచూ వినిపించే మాటలు. అంటే మంత్రి పదవికి ఎంత గౌరవం, ప్రాధాన్యం ఉందో ఈ వ్యాఖ్యలే రుజువు చేస్తాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ హయాంలో అయితే, ఒక జిల్లా ఎమ్మెల్యే ఎవరినైనా పరిచయం చేసుకోవడానికి వస్తే, “మీ మంత్రిగారిని కలిసివచ్చారా?” అని అన్నగారు నేరుగా అడిగేవారు. ఆ విధంగా ఆయన మంత్రుల ప్రాధాన్యాన్ని వెలుగులోకి తెచ్చి, బాధ్యతను గుర్తు చేసేవారు. ఆ కాలంలో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఒక బలమైన బాండింగ్ ఉండేది. మంత్రి పదవికి గౌరవం, విలువ పెరగడంతో పాటు, ఆ బాధ్యత కోసం పోటీ కూడా అధికంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఈ విధానం మారిపోయింది. కేంద్రీకృత రాజకీయ ధోరణి పెరిగి, మంత్రుల అధికారాన్ని తగ్గిస్తూ, వారిని కేవలం డమ్మీ స్థానాల్లో ఉంచే పరిస్థితి వచ్చింది.


వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ధోరణి మరింత బలపడింది. మంత్రులను మించి, కొంతమంది కీలక నేతలను సీఎం నేరుగా తన సన్నిహిత సలహాదారులుగా నియమించుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులను పక్కనపెట్టి, నేరుగా ఆ సలహాదారులకే సమస్యలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవస్థలోనే కేవీపీ రామచంద్రరావు వంటి నేతలు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. తర్వాత చంద్రబాబు హయాంలో మరో రకం ధోరణి కనిపించింది. అన్ని విషయాలూ సీఎంకే చెప్పాలి, ఆయన అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోరాదు అన్న పద్ధతి బలపడింది. మంత్రులు తమ తమ శాఖలకు పరిమితమైపోయారు.


వైసీపీ పాలనలో అయితే మంత్రి పదవి ఒక సాంప్రదాయ గుర్తింపుగా మిగిలిపోయింది. “మా మంత్రికి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే” అనే భావన ప్రజల్లో, నేతల్లో ఏర్పడింది. కారణం పార్టీ అధినేత‌ ఆధిపత్య రాజకీయాన్ని బలంగా అమలు చేయడం. మంత్రులు కూడా కలిసికట్టుగా ఆ వ్యవస్థలో ఇమిడిపోవడంతో, స్వతంత్ర అధికారాన్ని కోల్పోయారు. ఫలితంగా మంత్రుల నిర్ణయ శక్తి జీరో అయిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఇంకా విభిన్నంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు తమ జిల్లా మంత్రులు, త‌మ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులను లెక్క చేయడం లేదన్న భావన స్పష్టంగా కనబడుతోంది. మంత్రి అయితే ఏమిటి ? అన్న ధోరణి బహిరంగంగా వ్యక్తమవుతోంది. ఇది రాజకీయ పరిపాలనా వ్యవస్థకు, పార్టీ ప్రతిష్టకు కూడా హానికరమే అన్న అవగాహన అన్ని వర్గాల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: