ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒక వైపు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, మరో వైపు తాను భాగస్వామిగా ఉన్న కూటమి - ఈ రెండింటి మధ్య పవన్ నిజంగా ఇరుక్కున్న పరిస్థితి. గురువారం అసెంబ్లీలో జరిగిన సినీ పరిశ్రమ చర్చలో ఈ ఇష్యూ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ, గతంలో జగన్ సినీ ప్రముఖులకు అవమానం చేశారని, ముఖ్యంగా చిరంజీవిని కలవకుండా అడ్డగించారు అని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన ప్రముఖుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. అవమానం జరిగిందన్నది నిజమే కానీ కామినేని చెప్పిన విధానం తప్పు అని ఆయన ఖండించారు. అంతే కాకుండా చిరంజీవి గట్టిగా మాట్లాడలేదు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఇష్యూ ఒక్కసారిగా "బాలయ్య వర్సెస్ చిరంజీవి" రూపం దాల్చింది.


ఈ వివాదం మరింత రగిలిపోతుండగా, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చి పూర్తి క్లారిటీ ఇచ్చారు. 2020లో తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసిన సందర్భంలో ఎలాంటి అవమానం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. "జగన్ గారు మనలను సాదరంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చలు జరిగాయి. టికెట్ రేట్ల పెంపు, ఇతర అంశాలు పరిష్కరించబడ్డాయి" అని ఆయన లేఖలో వివరించారు. తనకు ఎప్పుడూ ఎవరి దగ్గరైనా గౌరవం ఇచ్చి పుచ్చుకునే స్వభావం ఉందని కూడా గుర్తు చేశారు. ఇక ఇక్కడే పవన్ కళ్యాణ్‌కి చిక్కు మొదలైంది. గత ఐదేళ్లుగా ప్రతి వేదికపైనా "జగన్ నా అన్నయ్యకు అవమానం చేశాడు" అని గట్టిగా ప్రచారం చేసిన పవన్ మాటలన్నీ ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో తేలిపోయాయి. ఇక ఆయన తాను అన్నది తప్పు అని ఒప్పుకోవాల్సి వస్తుందా? లేకపోతే తన వాదననే కొనసాగిస్తే బాలయ్య చెప్పినదే నిజమని అంగీకరించాల్సి వస్తుందా? ఈ రెండు పరిస్థితుల్లోనూ పవన్ ఇరుక్కున్నట్లే కనిపిస్తున్నాడు.

 

కూటమి వాదన స్పష్టంగా "జగన్ సినీ ప్రముఖులను అవమానించారు" అన్నదే. బాలయ్య కూడా అదే లైన్ లోనే ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రం వ్యతిరేకంగా తనపై ఎలాంటి అవమానం జరగలేదని చెబుతున్నారు. ఇక కూటమి నేతగా పవన్ ఈ రెండు విభిన్న పరిస్థితుల్లో ఏ వైపు నిలబడతాడు అన్నది కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో ఒక్క మాట మాట్లాడినా, మౌనం వహించినా ఇబ్బందే. తన అన్నయ్య చెప్పినదే నిజం అని నమ్ముకుంటే కూటమి వాదనను దెబ్బతీసినట్లవుతుంది. కూటమి మాట నిలబెట్టుకుంటే తన అన్నయ్యను తానే తప్పుపట్టినట్లవుతుంది. ఇలాంటివి రాజకీయాల్లో పెద్ద చిక్కులను రేపుతాయి.మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో "నలుగుతున్నది మాత్రం ఆయనే" అన్న మాట నిజమవుతోంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు జగన్‌పై చేసిన ఆరోపణలు ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో తేలిపోయాయి. ఇక ఈ అంశంపై పవన్ ఎలా స్పందిస్తాడు? మౌనం వహిస్తాడా? లేకపోతే కూటమి పక్షాన నిలబడతాడా? అన్నది రానున్న రోజుల్లో రాజకీయంగా పెద్ద చర్చగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: