
ఈ ఓటమికి ప్రధాన కారణాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, పంజాబ్ బ్యాటింగ్ విభాగంలో జరిగిన పలు నిర్ణయాత్మక లోపాలే ఓటమికి దారితీశాయని విశ్లేషణ జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్లు నెమ్మదిగా ఆడటం, ముఖ్యంగా నేహాల్ వధేరా అత్యంత నెమ్మదిగా ఆడటం ఓటమికి పెద్ద కారణంగా మారింది. వధేరా 18 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి, టీమ్ స్కోరును నిర్మించాల్సిన సమయంలో ఒత్తిడిని పెంచాడు. అదే సమయంలో ఒక్క పరుగుకే శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడం కూడా పంజాబ్ బ్యాటింగ్‌కి దెబ్బతీసింది.
ఇంకా నిర్ణయాత్మక 17వ ఓవర్‌లో ఒకే ఓవర్లో వధేరా, స్టోయినిస్ వరుసగా అవుట్ కావడం మ్యాచ్ మోమెంటమ్‌ను పూర్తిగా మార్చేసింది. వీరికి తోడు మిడిలార్డర్ బ్యాటర్లు కూడా ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. ఇక ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా పాత్ర కీలకమైంది. అతడు తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ప్రత్యర్థి రన్ రేట్‌ను కట్టడి చేశాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతని స్పిన్ బౌలింగ్ పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ విధంగా, పంజాబ్‌కు మరోసారి టైటిల్ అందని ద్రాక్షగా మిగిలింది. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఈసారి కూడా నెరవేరకపోవడంతో అభిమానుల్లో బాధ కనిపించింది. ఐతే శశాంక్ సింగ్ లాంటి పోరాట యోధుడి ప్రయత్నం మాత్రం అభినందనీయమైనదిగా నిలిచింది.