
బీరుతో బైక్ నడవడం ఏంటి.. ఇది వినడానికే కాస్త విచిత్రంగా ఉందే అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా బీరుతో నడిచే బైక్ను తయారు చేశాడు. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ పరుగులు తీస్తుందట. దీంతో ఇక ఈ బీర్ బైక్ కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అమెరికాకు చెందిన మైకేల్సన్ బీర్ బైక్ను తయారు చేశాడు అని చెప్పాలి. గతంలో రాకెట్ తో నడిచే టాయిలెట్, జెట్తో నడిచే కాఫీ పాట్ ను కనుగొన్న మైకేల్సన్.. ఇటీవల బీర్ తో నడిచే బైక్ను రూపొందించాడు. ఇంతకీ బీర్తో బైక్ ఎలా నడుస్తుంది అనే అనుమానం కలుగుతుంది కదా.
అతను బైక్ లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్ ను 300 డిగ్రీల వరకు మండిస్తుందట. దీంతో నాజిల్స్ లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పనిచేస్తుందని మైకల్సన్ చెబుతున్నాడు. అయితే బీరుతో నడిచే మోటార్ సైకిల్ ను బ్లూమింగ్ టన్ లోని అతని గ్యారేజీలో నిర్మించాడట. ఇక ఈ బైక్ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. గ్యాస్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో ఇలాంటి వినూత్నమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు మైకల్ చెబుతున్నాడు. రెడ్ బుల్ సహా ఏదైనా ద్రవం కూడా తన బైక్ ఇంధనంగా మార్చుకోవచ్చు అని చెబుతున్నాడు. తాను మద్యం తాగనని.. అందుకే మధ్యాన్ని ఇంధనం గా మర్చి మెరుగ్గా వాడుకోవాలని ఆలోచన చేసినట్లు చెప్పుకొచ్చాడు.