
ఒకవేళ పొరపాటున లేదా కావాలని ఏ పాకిస్తానీ విమానమైనా భారత గగనతలంలోకి ప్రవేశిస్తే ముందుగా హెచ్చరికలు అందుతాయని, అయినా లెక్కచేయకపోతే ఏమాత్రం ఉపేక్షించకుండా కూల్చివేస్తామని భారత్ అత్యంత కఠిన స్వరంతో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవల పెహల్గామ్‌లో జరిగిన భయంకర ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం రేపుతోంది.
పాక్ ఎత్తులకు భారత్ పైఎత్తు..
నిజానికి, ఈ గగనతల వివాదాన్ని మొదలుపెట్టింది పాకిస్తానే. ఏప్రిల్ 24న భారత విమానాల కోసం తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇస్లామాబాద్ ప్రకటించింది. అంతేకాదు, కీలకమైన జల ఒప్పందాన్ని భారత్ పక్కనపెట్టడాన్ని నిరసిస్తూ, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ఒప్పందాలను రద్దు చేసుకుంది. భారతీయులకు ఇచ్చే ప్రత్యేక వీసాలను సైతం నిలిపివేసింది. పాకిస్తాన్ చర్యలకు ప్రతీకారంగానే భారత్ ఇప్పుడు మరింత గట్టిగా స్పందించింది.
విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం..
ఈ పరస్పర గగనతల మూసివేతల వల్ల ఇరు దేశాల విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఇప్పుడు భారత్‌ను చుట్టి, చైనా, శ్రీలంక మీదుగా సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పాకిస్తాన్ చర్యల వల్ల ఇప్పటికే వందలాది భారత విమానాలు కూడా దారి మళ్లించుకోవాల్సి వచ్చింది, ఫలితంగా ఇంధన, సమయ వ్యయాలు అమాంతం పెరిగాయి.
సరిహద్దుల్లో హై అలర్ట్..
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. సరిహద్దుల్లో సైనిక బలగాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి. గగనతలంలో కఠిన ఆంక్షలు, భూభాగంపై సైనిక మోహరింపులతో వాతావరణం వేడెక్కింది. ఈ 'ఎయిర్ వార్' ఎటు దారితీస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.