
యావత్ ఆంధ్రదేశం ఆరాధించే తిరుమల శ్రీవారి చెంతకు వెళ్లే భక్తులకు, దక్షిణాది రాష్ట్రాల మధ్య తరచుగా ప్రయాణించే వారికి ఇది నిజంగా ఓ శుభవార్త. ప్రధాని మోదీ తన పర్యటనలో జాతికి అంకితం చేసిన ఎనిమిది జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో.. నాయిడుపేట-రేణిగుంట మధ్య నిర్మించిన ఆరు లేన్ల హైవే ఒకటి.
భారతమాల ప్రాజెక్ట్ లో భాగంగా ఎప్పుడో శ్రీకారం చుట్టిన ఈ రోడ్డు నిర్మాణం.. సుమారు 57 కిలోమీటర్ల మేర సాగింది. ఈ ఆరు లేన్ల రోడ్డును నిర్మించడానికి ఏకంగా రూ. 2,510 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయి, వాహనదారులు ప్రయాణించడానికి వీలుగా ఇప్పుడు ఈ హైవే సిద్ధమైంది.
కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండే నాయిడుపేట వద్ద ఈ ఆరు లేన్ల రోడ్డు మొదలవుతుంది. శ్రీకాళహస్తి మీదుగా సాగుతూ, కడప-చెన్నై రహదారిని కలుపుతూ చివరికి రేణిగుంట వద్ద ముగుస్తుంది. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు.. కీలకమైన హైవేలను కలిపే ఓ సెంట్రల్ కనెక్టివిటీ రూట్ అన్నమాట.
ఈ అదిరిపోయే హైవేపై స్పీడ్ లిమిట్స్ కూడా అదిరిపోయాయి. ఇకపై కార్లు అయితే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో, బస్సులు, లారీలు సైతం గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోవచ్చు. ఈ మార్గంలో ప్రయాణం సుఖవంతంగా సాగేందుకు.. శ్రీకాళహస్తి దగ్గర స్వర్ణముఖి నదిపై ఓ భారీ కొత్త వంతెనతో పాటు, మొత్తం ఏడు వంతెనలు, పది రైల్వే ఓవర్ బ్రిడ్జిలను సైతం యుద్ధప్రాతిపదికన నిర్మించారు.
నాయిడుపేట నుంచి రేణిగుంట వరకు సూపర్ ఫాస్ట్ హైవే అందుబాటులోకి రావడంతో.. తిరుమల ప్రయాణం ఇకపై చాలా సులభం కానుంది. సమయం గణనీయంగా ఆదా అవుతుంది. ట్రాఫిక్ జామ్ ల బెడద ఉండదు. ఏపీకి మౌలిక వసతుల కల్పనలో ఇదొక పెద్ద మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో ఇలాంటి మరిన్ని హైవేలు రావాలని కోరుకుందాం.