అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కెపాసిటి ఏమిటో తొందరలోనే తేలిపోతుంది. తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చిలో విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మార్చి 3,4 తేదీల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతిలో పర్యటించబోతున్నారు. ప్రత్యేకంగా ఉపఎన్నిక పోటీ విషయమే అజెండాగా అమిత్ షా పర్యటన ఉండబోతోంది. రెండు రోజుల పర్యటనలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు తిరుపతి లోక్ సభ పరిధిలోని నేతలందరితో సమావేశం నిర్వహించబోతున్నారు. బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తే గెలుపు అవకాశాలపై సమావేశంలో అమిత్ షా అంచనాకు రాబోతున్నారు.




సొంతపార్టీ నేతల నుండి అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకుని తర్వాత జనసేన అధినేత పవన్ తో కూడా భేటీ అవుతారు. జనసేన తరపున అభ్యర్ధి పోటీ చేయాల్సిన అవసరాన్ని, గెలుపోటములను పవన్ వివరించబోతున్నారు. ఇందుకు అనుగుణంగానే అవసరమైన రిపోర్టును పవన్ ఇప్పటికే పార్టీ నేతల నుండి తెప్పించుకున్నారు. కాబట్టి అమిత్ ముందు పవన్ తన వాదనను వినిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే జనసేనాని వాదన ఎంతవరకు చెల్లుబాటు అవుతుందన్నదే కీలకమైంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ స్ధానంలో జనసేన పోటీ చేసింది లేదు. 2019 ఎన్నికల్లో కూడా బీఎస్పీ అభ్యర్ధికి జనసేన మద్దతిచ్చిందంతే. ఆ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్ధికి సుమారుగా 20 వేల ఓట్లొచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్ధికి వచ్చింది 16 వేల ఓట్లు.




అప్పటి లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటే రేపటి ఎన్నికల్లో మిత్రపక్షాల్లో ఏ పార్టీ తరపున అభ్యర్ధి నిలబడినా ఒరిగేదేమీలేదు. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో రెండు పార్టీలకు అసలు బలమేలేదు. కానీ గెలుపు తమదే అని రెండు పార్టీల నేతలు ఎగిరెగిరి పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతోటి దానికే తమ పార్టీ అభ్యర్ధే పోటీ చేయాలంటే తమ అభ్యర్ధే ఉండాలని రెండుపార్టీల నేతలు పట్టుబడుతున్నారు.  తన రెండు రోజుల పర్యటనలో ఈ పంచాయితిని అమిత్ షా తేల్చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే చెప్పారు. మరి అమిత్ షా పంచాయితిలో పవన్ కెపాసిటి ఏమిటో తేలిపోతుంది. అందుబాబులో ఉన్న సమాచారం ప్రకారమైతే బీజేపీ అభ్యర్ధి పోటీకి అనుకూలంగానే అమిత్ షా మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువున్నాయి. చూద్దాం పవన్ కెపాసిటికి నిజమైన పరీక్ష ఎదురవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: