విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై జనాలు భగ్గు మంటున్నారు. పార్లమెంటులో ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనతో పుండుమీద కారం చల్లినట్లుగా తయారైంది వ్యవహారం.  ఉక్కు ప్రైవేటీకరణపై దాదాపు నెలన్నర రోజుల క్రితం కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనతో ఆందోళనలు జరుగుతున్నాయి. మద్యలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీతో కొద్దిరోజులు ఆందోళనలు తగ్గిపోయాయి. అయితే తాజాగా వైసీపీ ఎంపిల ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తు ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించట నూరుశాతం తథ్యమని స్పష్టంగా చెప్పేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియ నుండి వెనక్కు తగ్గేది లేదన్నారు. కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారో లేదో వెంటనే విశాఖ భగ్గుమని మండుతోంది.




ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులకు తోడుగా ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు కూడా గొంతు కలిపాయి. సరే ఎవరెంత ఆందోళనలు చేసినా వెనక్కు తగ్గకూడదని కేంద్రం గట్టిగానే నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. దాంతోనే ఆందోళనలను లెక్క చేయకుండా ప్రక్రియను ముందుకు తీసుకెళుతోంది.  ఈ నేపధ్యంలోనే  ప్రధానమంత్రికి లేఖ రాసిన జగన్ అపాయిట్మెంట్ కోరారు. అఖిలపక్షాన్ని తీసుకొస్తానని తన లేఖలో చెప్పారు. క్షేత్రస్ధాయిలోని పరిస్దితులను, వాస్తవాలను తెలియజేయటానికి ఫ్యాక్టరీ కార్మిక ప్రతినిదులను కూడా తీసుకొస్తానని లేఖలో చెప్పారు. అయితే ఈ పరిస్ధితుల్లో మోడి అపాయిట్మెంట్ ఇస్తారా అన్నదే డౌటు.




ఏదేమైనా కేంద్రం వైఖరి మరోసారి స్పష్టమైపోయింది. కాబట్టి ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే ఎటువంటి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించుకోవాల్సింది రాష్ట్రంలోని రాజకీయ పార్టీలే. అయితే పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరటంలేదు. ప్రతి చిన్న విషయంలో ఒకదాన్ని మరొకటి పై చేయి సాధించేందుకు ప్రయత్నించే అధికార-ప్రధాన ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం రానంతవరకు మిగిలిన పార్టీలు చేయగలిగేదేమీలేదు. ఎందుకంటే బీజేపీ దాని మిత్రపక్షం జనసేన ఆందోళనల్లో పాల్గొనటం లేదు. కాబట్టి కేంద్ర నిర్ణయానికి అవి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్+వామపక్షాలను ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ పరిస్దితుల్లో రాజకీయపార్టీలను నమ్ముకునే కన్నా జనాలే ఏమి చేయాలో నిర్ణయించుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: