లాక్ డౌన్ టైమ్ లో సినిమా వాళ్ల గురించి అనుకునేవారే లేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా వ్యాక్సిన్ పేరే కలవరించారు. అయితే సినిమావాళ్లు మాత్రం వంటలు చేస్తూ, ఎక్సర్సైజ్ లు చేస్తూ.. ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండటానికి ప్రయత్నించారు. కాస్తో కూస్తో పని పూర్తయిన సినిమాల నుంచి అప్ డేట్స్ అడక్కపోయినా వస్తుండేవి. ఈ క్రమంలో రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ పై కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ బాగానే పడింది. సినిమాకి సంబంధించి షూటింగ్ తిరిగి మొదలైందంటూ రాజమౌళి విడుదల చేసిన వీడియోకి పూర్ రెస్పాన్స్ రావడమే దీనికి నిదర్శనం.

అయితే ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ టీజర్ విడుదలైన తర్వాత మాత్రం ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్, ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్. అవును.. భీమ్ ఫర్ రామరాజు అంటూ అప్పట్లో రామ్ చరణ్ టీజర్ విడుదల తర్వాత అందరూ ఆ టీజర్ మేకింగ్ గురించి మాట్లాడుకున్నారు. సినిమా అదిరిపోతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు రామరాజు ఫర్ భీమ్ టీజర్ తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్ లో రామ్ చరణ్ వాయిస్ వీక్ గా ఉందని అనుకున్నా.. తర్వాత తర్వాత ఆర్ఆర్ఆర్ సినమాపై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

దీనికి కారణం టీజర్ లో ఎన్టీఆర్ ని ముస్లిం యువకుడి గెటప్ లో దర్శకుడు రాజమౌళి చూపించడమే. నిజాంలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రని అలా చూపించడం చాలామందికి నచ్చలేదు. తీరా సినిమా విడుదలయ్యాక అందులో ఏమీ లేదని తేలినా కూడా.. టీజర్ తో మాత్రం జనాల్లో క్యూరియాసిటీ పెంచేశాడు రాజమౌళి. కేవలం ఈ ఒక్క టీజర్ తోనే ఆర్ఆర్ఆర్ కి కావాల్సినంత ప్రచారం లభిస్తోంది.

సినిమావాళ్లకు నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా ఏదో ఒక ప్రచారం మాత్రం అవసరం. ఎందుకంటే.. సినిమా గురించి జనం ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటేనే దానికి క్రేజ్ వస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎన్టీఆర్ టీజర్ తో ఆర్ఆర్ఆర్ పై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యంతరకరంగా ఎలాంటి సీన్లు ఉండవని కొంతమంది భరోసా ఇస్తున్నా.. సినిమా విడుదలయ్యే వరకు ఎవరూ ఎలాంటి అంచనాలకు రాలేరు. మొత్తమ్మీద ఈ వివాదాలే ఆర్ఆర్ఆర్ ని మరింత పాపులర్ చేసేలా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: