భారతదేశం కరోనా ఉధృతి నుంచి మెల్లమెల్లగా కోలుకుంటుంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కార్యకలాపాలు తిరిగి మొదలు పెట్టుకోవడానికి సన్నాహాలు ఆరంభించాయి. సినిమా ఇండస్ట్రీ కూడా రెండవ దశ కరోనా తర్వాత  పనులు ప్రారంభించడానికి సన్నాహాలు ఇప్పటికే మొదలుపెట్టింది. థియేటర్లు కూడా జూలై నుంచి ఓపెన్ అవుతాయి అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అంక్షలకు సడలింపు ఇస్తున్నారు. పగటిపూట కార్యకలాపాలకు ఇబ్బంది ఉండట్లేదు.  వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. 

రోజువారి కరోనా కేసుల సంఖ్య లక్షకు దిగువగా ఉండడంతో మరణాల సంఖ్య కూడా బాగా తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నెలాఖరుకు కేసులు మరణాల సంఖ్య మరింత తగ్గుతుందని ఆ దిశగా దేశం మరింత ముందుకు కదులుతుందనీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి థియేటర్లు తెరచుకుంటున్నాయి అన్న అంచనాతో ఉన్నారు ప్రేక్షకులంతా. మహారాష్ట్రలో అయితే ఇప్పటికే థియేటర్లు తెరుచుకొని 50 శాతం ఆక్యుపెన్సీ తో నడుస్తుండడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కొత్త చిత్రాలు విడుదల దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఒక భారీ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు ఆ చిత్రమే బెల్-బాటం. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రంజిత్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 27న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. చిన్న చిత్రాలే రిలీజ్ డేట్ విషయం లో తటపటాయిస్తుంటే ఈ విషయంలో సినిమా నిర్మాత రిలీజ్ డేట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా మూడవ వేవ్ కూడా పొంచి ఉండడంతో మిగతా చిత్రాల నిర్మాతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఏదైతేనేం మళ్ళీ సినిమాలతో కొన్ని రోజుల్లో దియేటర్ లు కళకళలాడనున్నాయి. ప్రేక్షకులు ఈ వార్త కు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: