రాజస్థాన్ లో బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ... దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్‌. దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడం వల్ల గాంధీభవన్ వద్దే నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. 

 

రాజస్థాన్ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించింది కాంగ్రెస్. బీజేపీ తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ.

 

వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లకు వినతి పత్రాలు అందజేయాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని భావించారు. కానీ అనుమతి లేకపోవడం వల్ల గాంధీభవన్ ఎదుటే కాంగ్రెస్‌ నేతల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

 

అంతకు ముందు గాంధీ భవన్లో టీకాంగ్రెస్‌ నేతల సమావేశం జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం అభాసుపాలవుతోందని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి. తెలంగాణలో కేసీఆర్ చెప్పినట్టు పోలీసు యంత్రాంగం నడుస్తోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వేరు వేరు కాదన్నారు. 

 

సమావేశంలో సీనియర్ అయిన తనకు కాకుండా రేవంత్ రెడ్డికి మైక్‌ ఇవ్వడంపై హనుమంత రావు అలిగారు. అందరినీ తోసుకుంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో అప్పటికే అక్కడున్న పోలీసులు హనుమంతరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ర్యాలీగా బయలుదేరిన నాయకుల్ని అదుపులోకి తీసుకుని... పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

 

మొత్తానికి కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాటలు జరిగాయి. కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ విధానాలపై మండిపడుతూ నిరసనలు చేపడుతున్నారు. 

 

దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు హస్తం పార్టీనేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల దృష్టిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: