నగరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇప్పుడు దుర్గం చెరువు కూడా చేరిపోయింది. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అందంగా మారింది. చారిత్ర‌క హైదరాబాద్ న‌గ‌రానికి మరింత అందం చేకూర్చేలా దుర్గం చెరువుపై అత్యాధునిక ప‌రిజ్ఞానంతో కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్మించింది. రూ.184 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఈ తీగ‌ల వంతెన‌ను  సెప్టెంబ‌ర్ 25న ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెనతో జూబ్లీహిల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్ ర‌ద్దీ తగ్గనుంది. దీంతోపాటు దుర్గం చెరువులో బోటింగ్‌ను, కేబుల్ బ్రిడ్జికి అనుసంధానంగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 నుంచి నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్‌ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. దీనికి పెద్ద‌మ్మ‌త‌ల్లి ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టిన విష‌యం తెలిసిందే.


తాజాగా దుర్గం చెరువులో బోటింగ్‌ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇక తాజా విష‌యానికి వ‌స్తే దుర్గం చెరువులో నీటిపై తేలియాడే రెస్టారెంట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర టూరిజం శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇప్ప‌టికే ఒక దాన్ని అమ‌ల్లో పెట్ట‌డం విశేషం. ప‌ర్యాట‌కుల స్పంద‌న‌కు అనుగుణంగా మ‌రిన్ని పెంచేందుకు కూడా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్క‌డ స‌క్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ‌ల‌శ‌యాల్లో ఈ త‌ర‌హా రెస్టారెంట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప‌ర్యాట‌క‌శాఖ అధికారులు నిర్ణ‌యించారు. గ‌తంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక‌లు పంపగా తాజాగా ఆమోదం ల‌భించిన‌ట్లుగా తెలుస్తోంది.


దుర్గం చెరువుకు ఎన్నోఏళ్ల చ‌రిత్ర ఉంది. అంతేకాదు దీనికి ర‌క‌ర‌కాల పేర్లు ఉండ‌టం విశేషం. దుర్గం చెరువు హైదరాబాద్ నగరంలో రాయదుర్గ, మాధాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉంటుంది.  దీనిని రాయదుర్గ చెరువు అని కూడా పిలుస్తారు. నగరం సైబరాబాద్ గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండి, ఎక్కువమందికి ఎరుక లేకుండా కేవలం కొద్ది మంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు, సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్, లేదా రహస్య చెరువు అని మారు పేరు ఉంది. ఇప్పటికీ తస సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: