సింగరేణిలో ఎన్నికలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం-టీబీజీకేఎస్ విజయం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అనుబంధ సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘం తరపున ప్రతిపక్ష ఎమ్మెల్యే సీతక్కను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తోంది. దీంతో సింగరేణి ఎన్నికల్లో సీతక్క వర్సెస్ కవితక్క అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత.. సింగరేణి ఎన్నికల్లో గెలుపు కోసం హైదరాబాద్‌ నుంచే పావులు కదుపుతున్నారట. యూనియన్ నాయకులతో రెగ్యులర్‌గా సమావేశమవుతూ ఎప్పటికప్పుడు ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారట. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా.. యూనియన్‌ గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని సూచనలు, సలహాలు ఇస్తున్నారట. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనీ, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతను ఆకట్టుకునేలా కార్యక్రమాలు కొనసాగించాలని యూనియన్‌ నేతలకు కవితక్క మార్గనిర్దేశనం చేస్తున్నారట.

ఇక కాంగ్రెస్ కూడా.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచి పార్టీకి పట్టు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. నిజానికి గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపొందినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాండెట్లు గెలుపొందారు. 11 శాసనసభ స్థానాల్లో అధికార పార్టీ కేవలం మూడింటిని మాత్రమే కైవసం చేసుకుంది. ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు అధికార టీఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్లినా.. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీకి పట్టు ఉందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని కాంగీయులు భావిస్తున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత కొనసాగుతుండటంతో.. ఐఎన్‌టీయూసీ సింగరేణి విభాగం గౌరవాధ్యక్షురాలిగా ములుగు ఎమ్మెల్యే సీతక్కను నియమించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీతక్క, కవితక్కల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సీతక్కకు ముందునుంచి మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా గనులు విస్తరించి ఉన్న గోదావరి లోయ ప్రాంతంలోని అన్ని వర్గాల వారితో సీత‌క్కకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. గ‌తంలో సింగ‌రేణి స‌మ‌స్యల‌పై శాసనసభలోనూ సీతక్క గళమెత్తారు. ఆమె తన సహజ పోరాటపటిమతో సింగ‌రేణి కార్మికుల‌ను ఐఎన్‌టీయూసీ వైపు ఆకర్షించేలా చేస్తారన్న ఆశాభావంతో కాంగ్రెస్ హైకమాండ్‌ ఉందట. సీత‌క్కకు సింగరేణి ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు అప్పగించే  విష‌యంపై  యూనియన్‌లో ఇప్పటికే  నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమెకు కీలక బాధ్యతల అప్పగింత లాంఛ‌న‌మేన‌ని, ఈ మేరకు సాధ్యమైనంత త్వరలో అధిష్ఠానం నుంచి ప్రక‌ట‌న రావొచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరి అదే కనుక జరిగితే మాత్రం.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీతక్క, కవితక్క మధ్య జరిగే టగ్‌ ఆఫ్‌ వార్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: