వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయనుంది. గురువారం మంత్రి వర్గ భేటీ జరగనుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, దళితబంధు అమలుపై కేబినెట్ చర్చించనుంది. అలాగే.. ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్రం ప్రకటనపై భవిష్యత్ కార్యారణ చేపట్టనుంది. నీటి పారుదల, వ్యవసాయంతో పాటు పలు అంశాలపై మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ఈనెల 16న తెలంగాణ మంత్రి వర్గం భేటీ అవుతోంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీలో శాసనసభ అజెండాతో పాటు.. సమావేశ తేదీలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. సభలో ప్రతిపక్షాలకు దీటైన జవాబిచ్చేలా మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశానికి ఆ శాఖ మంత్రి లెక్కలతో సహా సమాధానం ఇచ్చేలా సూచలు చేయనున్నారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభంపై కూడా చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి అంశంపై ఏపీ చెబుతున్న అభ్యంతరాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

దళితబంధుపై సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రసంగించనున్నారు. ఒక రోజు మొత్తం దళితబంధుపై చర్చ కొనసాగనుంది. రాష్ట్రంలో ఉన్న 17లక్షల దళితులకు ఏ విధంగా లాభం చేకూరుస్తారో సభ నుంచే సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఒకేసారి కాకుండా ప్రతీ ఏటా 20వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి.. సంవత్సరానికి 2లక్షల మందికి దళితబంధు పథకం వర్తించేలా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. కరోనా తగ్గుముఖం పట్టినా సీజనల్ వ్యాధులు పెరుగుతుండడంపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు.

తెలంగాణలో వరి పంట సాగు విషయంలో గందరగోళం ఏర్పడింది. ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనమని ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. వాటిని తిప్పికొట్టడంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి పనుల స్థితిగతులు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్‌లపై చర్చ జరగనుంది. ఇటీవల కురిసిన వర్షాలతో.. పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: