పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై అస‌హ‌నం పెరిగిపోతోంది. హుజురాబాద్ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నా కూడా ఆయ‌న మాత్రం ఏమీ ప‌ట్ట‌ని విధంగానే ఉండిపోయారు. ఓడిపోతామ‌ని ముందే తెలిసి అస్త్ర స‌న్యాసం చేయ‌డం తగ‌ని ప‌ని అని కూడా సీనియ‌ర్లు చాలామంది ఆయ‌న‌కు చెప్పి చూశారు. కానీ బ‌ల‌మైన అభ్య‌ర్థి ఈటెల‌పై బ‌ల‌హీనమ‌యిన అభ్య‌ర్థి బ‌ల్మూరు వెంక‌ట్ పోటీచేసి సాధించిందేమీ లేక‌పోయింది. రేవంత్ రాక త‌రువాత పార్టీలో చాలా అస‌హ‌నం పెరిగిపోయింది. ముందునుంచి పార్టీని న‌మ్ముకున్న వారంతా ఆయ‌న రాక‌ను కానీ, ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అందించ‌డంపై కానీ అస్స‌లు ఆమోదాన్ని కానీ స‌మ్మ‌తిని తెల‌ప‌లేదు.


అంతేకాదు రేవంత్ ది కాంగ్రెస్ డీఎన్ఏ కాద‌ని టీడీపీ డీఎన్ఏ అని ఎంత కాద‌న్నా ఆయ‌న చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే పార్టీని న‌డుపుతారే త‌ప్ప సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునే వ్య‌క్తి అస్స‌లు కానే కాద‌ని ప‌లువురు సీనియ‌ర్లు పార్టీ హై క‌మాండ్ కు ఫిర్యాదుచేసినా, చంద్ర‌బాబుతో దోస్తీకి ఉవ్విళ్లూరుతున్న రాహుల్ అవేవీ ప‌ట్టించుకోలేదు. వినిపించుకోలేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఓ సారి నిర్ణ‌యం అయిపోయాక ఇక తానేమీ మాట్లాడ‌బోన‌ని కేవీపీ లాంటి వారు కూడా తేల్చేశారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగానికి తాను వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసేందుకే ఇష్ట‌ప‌డ‌తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి లాంటి వారు కేవీపీ రామ‌చంద్ర‌రావు లాంటి పెద్ద‌ల మాట‌లు వింటారా? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకొన్ని కొత్త మాట‌లు వినిపిస్తున్నాయి.

అవేంటంటే..
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగ‌ర్ రావు త‌న తిరుగుబాటు స్వ‌రాన్ని వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని అస్స‌లు అంగీక‌రించ‌డం లేదు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల నేత‌గా మంచి పేరున్న ఆయ‌న ప్ర‌త్యేకంగా త‌న సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే క్ర‌మంలో మ‌రికొంద‌రు కూడా రేవంత్ ను ఢీ కొనేందుకు సిద్ధం అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా ఇంకొంద‌రు పార్టీ గీత దాటి బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడేందుకే ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో వెన్నుపోటు రాజ‌కీయాలు షురూ కానున్నాయి. ఒక‌ప్పుడు వెన్నుపోటు రాజ‌కీయాలు న‌డిపిన చంద్ర‌బాబుకు దీటుగా ఇప్పుడు తెలంగాణ‌లో అదే త‌ర‌హా రాజ‌కీయ సూత్రాన్ని (పొలిటిక‌ల్ ఫార్ములాని) అప్లై చేసేందుకు చాలామంది క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల నాయ‌కులు ఉవ్విళ్లూరుతున్నారు అన్న‌ది వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: