అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్మకుందామనుకునే రైతు ఎన్నో గండాలు దాటాల్సి వస్తుంది. వాటికి తోడు ప్రకృతి  వైపరీత్యాలతో పంటలు ఆగవుతున్నాయి. వ్యవసాయం మీదనే ఆధారపడిన రైతులకు ఇలాంటి అవాంతరాలు ముంచెత్తడంతో విధిలేని పరిస్థితుల్లో విగతజీవులు అవుతున్నారు. పంట ఖర్చులు పెరిగి పోవడం, బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, విద్య, వైద్యం, ఖర్చులు రెట్టింపు కావడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి పోయి చివరకు అవి రైతులకు ఉరితాడవుతున్నది. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా తయారైంది. వారిని తమ ప్రభుత్వం గుర్తించబోదని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మానసిక వేదనకు గురి చేస్తున్నాయి.

కౌలు రైతులకు రుణ అర్హత లేదు. కౌలు చెల్లింపులు వారికి అదనపు భారం. ఉపాధి కోసం ఎంచుకున్న కౌలు వ్యవసాయం ఒడిదుడుకులకు లోనై ఆ రైతును చిక్కుల్లోకి నెట్టుతున్నది. దీనికితోడు గత మూడేళ్లుగా వృద్ధాప్య, వితంతువు, వికలాంగులకు కొత్త పెన్షన్లు లేవు. ఉపఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లోనే కొత్త పెన్షన్లకు అనుమతి ఇచ్చింది. తప్ప ఇతర ప్రాంతాల్లో ఇవ్వడం లేదు. అంత్యోదయ కార్డులను తగ్గించారు. అత్యంత నిరుపేద రైతులకు ఇవి కూడా సకాలంలో అందకపోవడం ఆత్మహత్యలకు ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నాయి. పండిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చిన రైతులు వరికుప్పల పై చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు పచ్చని పొలాల్లో పురుగుల మందు తాగి నిండు ప్రాణాలు వదులుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తెలంగాణ రైతుల పరిస్థితి తయారైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులు ప్రభుత్వాల రాజకీయ డ్రామాలకు బలవుతున్నారు. పాలకుల నిర్లక్ష్యమే అన్నదాతలకు మరణశాసనం అవుతున్నది. రైతు బంధు, రైతు బీమా, ప్రాజెక్టుల ద్వారా నీటి వసతి, ఉచిత కరెంటు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు గొప్పలు చెబుతున్న పాలకులు సమస్య మూలాల్లోకి పోవడం లేదు.

భూమిని నమ్ముకుంటే బతుకు బాగుంటుందని భావించిన వారికి ప్రస్తుతం ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా సౌకర్యం కల్పించింది. కానీ అందులో విధించిన నిబంధన ఎక్కువ మంది రైతులకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి.18-59 ఏండ్ల వయస్సు రైతులు చనిపోతేనే రైతు బీమా అందుతున్నది. ఆపైబడిన వయస్సు వారికి వర్తించడం లేదు. దీంతోపాటు కౌలురైతు బీమాకు ఆమడ దూరంలో ఉన్నాడు. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులు ఉంటే, 32లక్షల మందికి మాత్రమే సర్కార్ ప్రీమియం చెల్లిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: