బొత్స సత్యనారాయణ.... సత్తిబాబు అంటూ అంతా ముద్దుగా పిలుచుకునే సత్యనారాయణ... దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఓ సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సత్తిబాబు.. ఏకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించిన సత్తిబాబు... చివరికి విజయనగరం జిల్లాలో అటు బొబ్బిలి రాజులను, ఇటు విజయనగర గజపతి రాజులను ధీటుగా ఎదుర్కొన్నారు కూడా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ మాత్రమే. సత్తిబాబు ఎక్కడ ఉన్నా సరే... రాజకీయాల్లో మాత్రం ఆయన హవానే నడుస్తుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాల్లో బొత్స, ఆయన అనుచరులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ఎంపీ, జెడ్పీ ఛైర్మన్లు కూడా బొత్స బంధువులే. ఇప్పటికే జిల్లాతో పాటు... అటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం     తిప్పుతున్నారు సత్తిబాబు.

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సత్తిబాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా... ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఎస్ కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు బొత్స ప్రధాన అనుచరుడు. ఇక నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బొత్సకు సమీప బంధువు. ఇక బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు కూడా బొత్స వర్గానికి చెందిన నేత. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు సైతం మంత్రి బొత్స సత్తిబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇక విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా బొత్స వర్గానికి చెందిన వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరిలో దాదాపు సగం మందికి పైగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావని ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు బొత్స కూడా రాజకీయాలకు దూరమయ్యే ఆలోచనలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా... లేదా అనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం సత్తిబాబు పెద్దల సభపై కన్నేశారనే చర్చ జోరుగా నడుస్తోంది. మరి సత్తిబాబు మనసులో మాట ఏమిటో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: